AP High Court:ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోలు పోటీ పడుతున్నారు. అందులో భాగంగానే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్న రామ్ చరణ్(Ram Charan)ప్రస్తుతం శంకర్ (Shankar)దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరొకవైపు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj). ఈ చిత్రానికి బాబీ కొల్లి(Bobby Kolli)దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్, టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా విడుదల తేదీకి అంతా సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ రెండు చిత్రాలకు షాక్ తగిలినట్లు అయ్యింది. అసలు విషయంలోకి వెళ్తే.. సంక్రాంతికి రానున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాల టికెట్ ధరలను పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ అందులో పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని కూడా కోరారు. ప్రతివాదులుగా ఆ రెండు సినిమాల మూవీ టీమ్లను కూడా చేర్చడం జరిగింది. మరి దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్..
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. 2023 మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ టీజర్ ని నవంబర్ 9న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో విడుదల చేయగా అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషలలో విడుదల చేయబోతున్నారు.
బాలకృష్ణ డాకు మహారాజ్..
సాహసోపేతమైన దోపిడీదారుడు.. రాజ్యం లేని రాజు కావడానికి పోరాడుతూ శక్తివంతమైన వీరోధులతో విభేదాల మధ్య మనుగడ కోసం పోరాడుతూ తన సొంత భూభాగాన్ని స్థాపించాడు. ఇక ఇందులో డాకు మహారాజ్ గా నటిస్తున్నారు బాలయ్య. ఇందులో ఊర్వశీ రౌతేలా,దుల్కర్ సల్మాన్, బాబి డియోల్ , ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు పాయల్ రాజ్ పుత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్, రోనిత్ రాయ్ వంటి వారు కూడా భాగమయ్యారు. ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలు పెంచగా.. దానిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి అందరూ కూడా హైకోర్టు ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.