Posani Health Update: పవన్ కళ్యాణ్‌పై, ఆయన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోసాని కృష్ణమురళిని రెండు రోజుల క్రితం ఉన్నపళంగా అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లినప్పటి నుండి ఆయనకు ఆరోగ్యం సరిగా ఉండడం లేదని పోసాని అంటూనే ఉన్నారు. తాజాగా జైలులో ఆయనకు సీరియస్‌గా ఉందని చెప్పి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత పోసాని కృష్ణమురళి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. పోసానికి ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పగానే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ తర్వాత కడప రిమ్స్‌కు తరలించి మరోసారి వైద్య పరీక్షలు చేయించామని అన్నారు. అక్కడ తనకు మెరుగైన చికిత్స అందేలా చేశామని తెలిపారు. ప్రస్తుతం పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఆయనే డ్రామాలు ఆడుతున్నారని సీఐ వెల్లడించారు. వైద్య పరీక్షలు పూర్తవ్వడంతో త్వరలోనే ఆయనను మళ్లీ రాజంపేట సబ్ జైలుకు తరలిస్తామని అన్నారు.