Women’s Day Special: తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి పలు బృహత్తర కార్యక్రమాలను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆ దిశగా మహిళా దినోత్సవం రోజున కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే కొత్త పథకాల అమలుపై మంత్రి సీతక్క అధ్వర్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇంతకు ఆ కొత్త పథకాలు ఏమిటో తెలుసుకుందాం.
ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు సరికొత్త పథకాలతో లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. లక్ష మంది మహిళలతో మహిళా దినోత్సవ సభను నిర్వహిస్తుండగా, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరుకానున్నారు.
సంక్షేమ పథకాల వివరాలు ఇవే
మహిళా దినోత్సవం రోజున ప్రారంభించే సరికొత్త పథకాలపై ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ప్రతి జిల్లాలో మహిళా సంఘాలచే ఏర్పాటు కాబోయే సోలార్ విద్యుత్ ప్లాంట్లకు మహిళా దినోత్సవం రోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు. మొత్తం 32 జిల్లాల్లో జిల్లాకు 2 మెగావాట్ల చొప్పున మొత్తం 64 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం సాగనుంది. అలాగే మహిళా స్వయం సహాయక బృందాలచే బస్సుల కొనుగోలు చేయించడమే కాక, ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఒప్పందాలను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. అందులో భాగంగా మొదటి విడతలో 50 ఆర్టీసి అద్దె బస్సులకు పచ్చ జెండా ఊపి సీఎం ప్రారంభించనున్నారు.
నారాయణపేట జిల్లాలో మహిళా సంఘాలు ప్రారంభించిన పెట్రోల్ బంక్ తరహాలోనే మిగిలిన 31 జిల్లాల్లో పెట్రోల్ బంకులను మహిళా సంఘాల సారథ్యంలో ప్రారంభించనున్నారు. వడ్డీ లేని రుణాలు చెక్కులను మహిళా సంఘాలకు అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళా సంఘ సభ్యులకు రూ. 40 కోట్ల ప్రమాద బీమా చెక్కులను సైతం అదే రోజు సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు.
Also Read: CM revath reddy: తెలంగాణ పోలీసులకు గుడ్ న్యూస్.. హామీ నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి
మహిళా దినోత్సవం పురస్కరించుకుని 14 వేలకు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాల ప్రక్రియను సైతం మహిళా దినోత్సవం రోజున ప్రారంభిస్తారు. మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ అందించడమే కాక, సబ్సిడీ రూపంలో ఆటోలను ప్రభుత్వం అందించేందుకు సిద్ధమవుతుందని సమాచారం. మహిళల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక పటిష్టత కోసం మరికొన్ని పథకాలను మహిళా దినోత్సవం రోజున ప్రారంభిస్తారని, ఇప్పటికే మహిళల సంక్షేమం కోసం అవలంబిస్తున్న విధివిధానాలను పరిశీలించేందుకు అధ్యయన కమిటీని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం మీద ఏ రాష్ట్రంలో జరిగిన రీతిలో మహిళా దినోత్సవంను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.