Prabhas – Don Lee: మా డాంగ్ – సియోక్ అని కూడా పిలవబడే దక్షిణ కొరియన్ – అమెరికన్ నటుడు డాన్ లీ (Don Lee) .. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించబోయే స్పిరిట్ సినిమాలో విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు రావడానికి కారణం డాన్ లీ అని చెప్పవచ్చు. తాజాగా ఆయన తన ఇంస్టాగ్రామ్ కథనంలో సలార్ చిత్రంలోని ప్రభాస్ ఫోటోను పంచుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈయనకు ఇండియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) , ప్రభాస్ (Prabhas ) కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ సినిమాలో నటించబోతున్నాడు అంటూ వార్తలు రావడంతో ప్రభాస్ అభిమానులే కాదు డాన్ లీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
సలార్ లో నటిస్తున్నట్లు గతంలోనే వార్తలు..
గత ఏడాది విడుదలైన సలార్ : పార్ట్ 1 లోనే ఈయన విలన్ గా నటించబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపించాయి. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ సినిమాలో డాన్ లీ ప్రత్యేకమైన విలన్ పాత్రతో.. ప్రభాస్ ని ఢీకొట్టబోతున్నారు అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటించి ఆకట్టుకున్నారు.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.617 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు డాన్ లీ ప్రభాస్ పవర్ పంచ్ తో ఉన్న ఒక ఫోటోని విడుదల చేయడంతో.. స్పిరిట్ సినిమాలో డాన్ – లీ విలన్ గా నటించబోతున్నారు అని దాదాపు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.
డాన్ లీ పంచ్ పవర్ కి రికార్డ్ బ్రేక్..
ఇదిలా ఉండగా తాజాగా డాన్ లీ షేర్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా ఆయన తన పంచ్ పవర్ ఏంటో చూపించి అందరిని ఆశ్చర్యపరిచారు. డాన్ లీ పవర్ పంచ్ మెషిన్ లో తన పవర్ ఏంటో చూపించారు. డ్రాగన్ పంచ్ పవర్ మెషిన్ లో ఆయన ఇచ్చిన పంచ్ కి రీడింగ్ ‘9968N ‘ కి వెళ్లిపోయింది. సాధారణంగా 2500 న్యూటన్స్ అంటే అది చాలా గొప్ప విషయం. అలాంటిది ఈయన దీనికి మూడింతలు వేగంతో తన పంచ్ యొక్క పవర్ చూపించడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంత పంచ్ దెబ్బకి ప్రభాస్ తట్టుకుంటారా అంటూ కొంతమంది సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
డాన్ లీ విషయానికి వస్తే..
1971లో దక్షిణ కొరియాలోని సియోల్ లో జన్మించారు. తన అద్భుతమైన నటనతో గోల్డెన్ గ్లోబ్స్ వంటి మరెన్నో అవార్డులు కూడా అందుకున్నారు. నటుడిగా, రచయితగా , దర్శకుడిగా, మ్యూజీషియన్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు డాన్ లీ. ఇక ఈయన హాలీవుడ్ స్టార్ నటుడు మాత్రమే కాదు హాలీవుడ్ ఫిలిం ప్రొడ్యూసర్ కూడా..