Pruthvi Raj: ఇప్పట్లో పాన్ ఇండియా సినిమాలు అనగానే వందల కోట్ల బడ్జెట్, భారీ స్టార్లు, ఇంటర్నేషనల్ టెక్నిషియన్లు మామూలే. కానీ, అసలు ఈ బడ్జెట్ లో ఎంతమేరకు నిజంగా సినిమా మేకింగ్ కి వెళ్తోంది? ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే – మొత్తం బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్లకే వెళ్తోంది. అంటే ఒక సినిమా 100 కోట్ల బడ్జెట్ లో చేస్తే, దాంట్లో 80 కోట్లు హీరో, డైరెక్టర్, ఇతర నటీనటుల రెమ్యునరేషన్ కు వెళ్తున్నాయి. మిగిలిన 20 కోట్లు మాత్రమే సినిమాటోగ్రఫీ, లొకేషన్లు, CG, ఇతర టెక్నికల్ పనుల కోసం ఉపయోగిస్తున్నారు.
మలయాళ ఇండస్ట్రీ – కంటెంట్ కి ప్రాధాన్యత!
ఇలాంటి పరిస్థితుల్లో మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ పూర్తిగా వేరే దారి లో వెళ్తోంది. హీరో, డైరెక్టర్, ఇతర నటీనటుల రెమ్యునరేషన్ ను తగ్గించి సినిమా క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా హీరో-డైరెక్టర్-ప్రొడ్యూసర్ పృథ్విరాజ్ సుకుమారన్ వెల్లడించాడు.
“మోహన్ లాల్ తో చేసిన ‘ఎంపురాన్’ సినిమా బడ్జెట్ తక్కువగానే ఉంది, ఎందుకంటే మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఇతర ఆర్టిస్టులు కూడా తక్కువే తీసుకున్నారు. అందుకే సినిమా మొత్తం మేకింగ్ మీదే ఖర్చు పెట్టగలిగాం. అందుకే మీకు ఆన్-స్క్రీన్ లో గ్రాండ్ విజువల్స్, హై క్వాలిటీ కనిపిస్తోంది” అని పృథ్విరాజ్ చెప్పాడు.
మలయాళ సినిమాల్లో 100 కోట్ల బడ్జెట్ ఉంటే, మొత్తం సినిమాకే ఖర్చు పెడతారు. కానీ, ఇతర ఇండస్ట్రీల్లో ఎక్కువగా కాస్టింగ్, స్టార్స్ రెమ్యునరేషన్ పైనే ఖర్చు పెడుతున్నారు.
నిర్మాతల భారం – హీరోలు తగ్గిస్తే బాగుంటుంది!
ఈ ట్రెండ్ వల్ల నిర్మాతల మీద బాగా ఒత్తిడి పెరుగుతోంది. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా డబ్బులు వెచ్చించేది నిర్మాతలే. స్టార్ హీరోలు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటే, వాళ్లకేం నష్టం ఉండదు. కానీ, నిర్మాతల ఫ్యూచర్ మాత్రం ప్రమాదంలో పడుతుంది. ఇటీవల భారీ బడ్జెట్ లో వచ్చిన కొన్ని సినిమాలు నష్టాల్లోకి వెళ్లినప్పటికీ, హీరోలు, డైరెక్టర్లు మాత్రం తమ రెమ్యునరేషన్ లాభం కోల్పోలేదు.
పాన్ ఇండియా vs కంటెంట్ సినిమాలు – మారాలి ట్రెండ్!
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు రాబట్టే కలెక్షన్లను చూసి హీరోలు రెమ్యునరేషన్ పెంచుకుంటున్నారు. కానీ, అదే విధంగా సినిమా స్టాండర్డ్స్ పెరగడం లేదు. కనీసం మలయాళ ఇండస్ట్రీలా మేకింగ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే, ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందించగలుగుతాం. స్టార్ హీరోలు కొంచెం తక్కువ రెమ్యునరేషన్ తీసుకుని, సినిమాకే ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తే – హాలీవుడ్ లెవెల్ మూవీస్ మన ఇండస్ట్రీ నుంచీ రావడం ఖాయం!