Puri Jagannath:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న పూరీ జగన్నాథ్ (Puri Jagannath).. తాజాగా ‘పూరీ మ్యూజింగ్స్’ పేరిట పలు అంశాలపై చర్చిస్తూ సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే వారి జీవితాలు నాశనం అవ్వడానికి కారణం వాడే అంటూ అసలు విషయంపై క్లారిటీ ఇచ్చారు. మరి ఎవరి జీవితాలు ఎవరు నాశనం చేస్తున్నారు? అసలు పూరీ ఏం చెప్పాలనుకుంటున్నాడు..? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
అన్నింటికీ వాడే కారణం – పూరీ జగన్నాథ్
పూరీ చెబుతున్న వాడు ఎవడో కాదు ప్రతి ఒక్కరిలో ఉండే ఈగో.. “ఈగో అనేది మంచిదే. మన ఆత్మాభిమానాన్ని కూడా కాపాడుతుంది. కానీ కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది” అని అంటున్నారు పూరీ జగన్నాథ్. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. “నువ్వు నా బ్రెయిన్ లో ఉన్నది నేనే కదా అనుకుంటావు. కానీ అది నువ్వు కాదు. నీ లోపల ఇంకొకడు ఉంటాడు. వాడి పేరే ఈగో.. నీ జీవితం మొత్తం రన్ చేసేది వాడే.. ఓవర్ థింకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి వాడే సీఈవో కూడా.. ఎవరైనా నీ మీద జోక్ చేస్తే నువ్వు పట్టించుకోవు కానీ నీలో ఉండే ఈగో అనే వాడు అనవసరంగా హర్ట్ అవుతాడు. ఎక్కడ లేని కోపం వచ్చేలా చేస్తుంటాడు. ముఖ్యంగా అవతల వారితో ఎలా చర్చకు దిగాలి? అందులో మనదే పై చేయి కావాలంటే ఎలా? ఏం మాట్లాడాలి? అనే విషయాలపై అనుక్షణం నీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు.
వాడు చెప్పే మాట వినడం తగ్గించుకుంటే బాగుపడతావ్..
ప్రతి చిన్న విషయానికి వాడికి కోపం వస్తూ ఉంటుంది. భోజనం మనకు ముందు వడ్డించాలి కదా..! మనకి ముందు చెప్పాలి కదా..! మనల్ని ఎందుకు విష్ చేయలేదు ? ఇలా ప్రతి విషయానికి కూడా వాడికి కోపం వస్తూ ఉంటుంది. ఏదైనా తప్పు చేసినప్పుడు సారీ చెబితే.. అలా చెప్పద్దు.. నువ్వు చెబితే వీక్ అయిపోతావు. నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు. నీ విలువ నీకు తెలియదు అంటూ ఇలా ఎన్నో టిప్స్ చెబుతూ ఉంటాడు. వాడు చెప్పే లైఫ్ కోచింగ్ పాఠాలను నువ్వు అసలు తీసుకోవద్దు. ఉదాహరణకు నీ ఫ్రెండ్ తన చెల్లి పెళ్లికి రమ్మని పిలిస్తే.. నీలోని వాడు వద్దురా 2017 లో మీ అక్క పెళ్లికి వాడు రాలేదు అని చెబుతాడు. వీడికి పనికిమాలిన విషయాలన్నీ కూడా గుర్తుంటాయి. ఇక పెళ్లి జరిగితే భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు అంటే అది వాళ్ళు కాదు.. వాళ్లలో ఉండే ఈగో.. అలా అని మన ఈగోని మనం తీసేయలేం. వాడు మన తోడబుట్టిన తమ్ముడు లాంటివాడు. మనతోనే ఉంటాడు. లోతుగా చూస్తే ఈ ఈగో బ్రదర్ చాలా మంచివాడు. మన ఆత్మాభిమానాన్ని కూడా కాపాడుతాడు. అందరి ముందు మనం తలవంచ కూడదు, తగ్గకూడదు అనేది వాడి ఆలోచన. మనల్ని కాపాడే కవచంలా కూడా ఉంటాడు. ఎవరినైనా హార్ట్ చేసే సత్తా వాడికి ఉంది. ఆఖరికి తల్లిదండ్రులు కూడా వీడి వల్ల దూరమైపోతారు. అందుకే మీలో ఉన్న ఈగో అనే వాడిని దాచిపెట్టి పనులు చేయగలిగితే సగం గొడవలు తగ్గిపోతాయి. ఈగో అనేది జ్వాల లాగా చిన్నగా ఉంటే వెచ్చగా ఉంటుంది. మంట పెరిగితే చుట్టూ అన్ని తగలబడి పోతాయి. అందుకే ఏం చేసినా సరే నీకు నువ్వు ఆలోచించు. కానీ నీలో ఉండే వాడు చెప్పినట్లు వినడం తగ్గించుకుంటే, అందరి జీవితాలు బాగుపడతాయంటూ ” పూరీ జగన్నాథ్ తెలిపారు.