Simhachalam temple: సింహాచలం వరాహ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో చందనోత్సవం రోజు ఘటనపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదిక ఆధారంగా ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. మరికొందరిపై క్రిమినల్ చర్యలకు సిద్ధమైంది.
తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఊరుకునేది లేదని తెగేసి చెప్పేసింది చంద్రబాబు సర్కార్. అందుకు సింహాచలం దేవాలయంలో ఏప్రిల్ 30న జరిగిన ఘటన ఓ ఎగ్జాంఫుల్. ఘటన జరిగిన తర్వాత ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది ప్రభుత్వం.
సింహాచలం టెంపుల్ ఘటన, ఏడుగురిపై వేటు
పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సురేశ్‌కుమార్, ఈగల్ ఐజీ రవికృష్ణ, జలవనరుల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావులు ఈ కమిటీ కీలకమైన సభ్యులు. ఘటన మరుసటి రోజు సింహాచలం దేవాలయానికి వెళ్లి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మరుసటి రోజు విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో దేవస్థానం ఉన్నతాధికారులను అధికారులను పిలిచి విచారించారు.
ఆ తర్వాత ఘటన జరిగిన రోజు అక్కడున్న పోలీసులను సైతం విచారించింది. దాదాపు 20 నుంచి 30 మందితో మాట్లాడారు. ఎలాంటి అనుమతులు లేకుండా గోడ నిర్మాణం జరిగినట్టు తేల్చింది. నిర్మాణం సమయంలో ఇంజనీరింగ్ నిబంధనలు ఏమాత్రం పాటించలేదని గుర్తించారు. అధికారుల ఒత్తిడి వల్ల గోడ నిర్మాణం చేపట్టామన్నది సదరు కాంట్రాక్టర్ వెర్షన్.
ALSO READ: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. విద్యానిధి స్కీమ్
వీటిని పరిశీలించిన త్రిసభ్య కమిటీ, ఈ ఘటన వెనుక బాధ్యులు ఎవరో తేలుస్తూ చర్యలకు సిఫారసు చేసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ఆరు పేజీలతో ప్రాథమిక నివేదికను సమర్పించారు ఐఏఎస్ అధికారి సురేశ్‌కుమార్. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం, ఏడుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది.
నిర్మాణంలో కొన్ని లోపాలు ఎత్తి చూపింది. గోడ నిర్మాణానికి డిజైన్లు లేవు. డ్రాయింగ్, ప్లాన్ అనేది అస్సలు లేదు. బరువును తట్టుకునేలా గోడను రూపొందించలేదు. ఇంకా లోతుగా వెళ్తే.. గోడకు ఎలాంటి పునాది లేదు. కేవలం నేలపై నిర్మించారు. దీనికితోడు క్వాలిటీ లేని ఇటుకలు, సిమెంట్ వినియోగించారు. గోడకు సరిగా క్యూరింగ్ చేసిన సందర్భం లేదు.
కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు
సమీపంలో తవ్విన మట్టిని గోడ వెనుక వేయడం కారణమైంది. పైగా ఆ రాత్రి వర్షం కురవడం, మట్టి తడిచిపోవడంతో గోడపై ఒత్తిడి పెరిగింది. సింహాచలం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓ సుబ్బారావు, దేవస్థానం ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఈఈ శ్రీనివాసరాజు, ఆలయం డిప్యూటీ ఈఈ కేఎస్ఎన్ మూర్తి, ఆలయ ఏఈ బాబ్జీ, ఏపీటీడీసీకి చెందిన ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ కెఎస్ఎస్ స్వామి, ఏఈ మదన్‌మోహన్‌లను సస్పెండ్ చేసింది.
కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. ఆయన సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టింది. రేపో మాపో సీఎం చంద్రబాబు ఆకస్మిక పర్యటనకు శ్రీకారం చుట్టున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు పదే పదే హెచ్చరిస్తున్నారు కూడా. ఒక విధంగా చెప్పాలంటే తప్పు చేస్తే చర్యలు తప్పవని చెప్పకనే చెప్పేసింది ప్రభుత్వం. అధికారులు తస్మాత్ జాగ్రత్త.