Puri Jagannath..ప్రముఖ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) ఈమధ్య ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో వివిధ అంశాలపై మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ‘అన్ సక్సెస్ఫుల్’ అనే అంశంపై మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు. పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..” సక్సెస్ఫుల్ అనేది ఒక డీల్ కాదు. అసలైన సక్సెస్ అంటే ఏంటి.. పెద్ద ఉద్యోగమో.. పెద్ద ఇల్లు.. ఖరీదైన కారు.. ఇవన్నీ కానే కాదు.. ఉదాహరణకు ఇవన్నీ సంపాదించిన వారు మనశ్శాంతిగా నిద్రపోయిన రోజులు లేనేలేవు. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న వాళ్లే మనకు ఎక్కువగా కనిపిస్తారు. అయితే నష్టం ఏముంది.. ఒక్కోసారి ఫెయిల్ కావచ్చు.. మీరు అనుకున్న గమ్యం చేరలేకపోవచ్చు.. అలాగని మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు. ఒకప్పుడు కాఫ్కా, వాన్ గోహ్ వంటి వారంతా కూడా తమను తాము ఫెయిల్యూర్ గానే భావించారు. కానీ వాళ్ళు చేసిన పని సక్సెస్ కంటే గొప్పది. ఇక సాధారణంగా జీవితం గడిపే చాలా మంది ఉంటారు. వాళ్లు ఇష్టపడే పనిని ఎంతో ఇష్టంగా చేస్తారు. ఇలాంటివారు ఏ రోజు కూడా ప్రశంస, గుర్తింపు కోసం పనిచేయరు. నా ఉద్దేశంలో సక్సెస్ అంటే మనశ్శాంతిగా ఉండడమే.
అసలైన సక్సెస్ అంటే అదే..
రోజు చేపలు పట్టేవాడు కూడా ఎంతోమందికి తిండి పెడతాడు. అక్కడ స్కూల్ టీచర్ కూడా మనసుపెట్టి పాఠాలు చెబుతుంటే, ఎన్నో వేలమంది పిల్లల జీవితాలు కూడా మారిపోతాయి. తోటమాలి దగ్గర మొక్కలు కొనుక్కొని దేశం అంతా నాటుతాము. అవి మహావృక్షాలవుతాయి. ఎంతోమందికి నీడను కూడా ఇస్తాయి. అయితే సొసైటీ పరిభాషలో వీళ్లంతా సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులు కాదు. వీళ్లంతా బిలినియర్ కంటే ఆనందంగా ఉండగలరు. మనశ్శాంతిగా నిద్రపోగలరు కూడా.. అందరూ క్లాస్ టాపర్ కాలేరు.. అలాగని మిగిలిన వాళ్ళు పనికిరాని వాళ్ళు ఏమి కాదు కదా.. ప్రపంచం అంతా సక్సెస్ స్టోరీలను మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటుంది. అయితే అందులో మన కథలేదని ఎవరూ బాధపడకూడదు. మీ జీవితాన్ని సంపద, పేరు, ప్రఖ్యాతలు, అధికారం వంటి వాటితో పోల్చుకోవద్దు.. మీ దారిలో మీరు సక్సెస్ అవ్వండి. సంతోషం, సక్సెస్ లేకపోయినా దొరుకుతుంది. ఇష్టమైన పని చేసుకుని హ్యాపీగా నిద్రపోవడం కంటే సక్సెస్ ఏముంటుంది..ప్రపంచంలో ఒక శాతం ప్రజలు మాత్రమే దీని అనుభూతి చెందగలరు.. అందుకే జీవితంలో అన్ సక్సెస్ఫుల్గా ఉన్నా తప్పేమీ లేదు అంటూ తెలిపారు పూరీ జగన్నాథ్.
పూరీ జగన్నాథ్ సినిమాలు..
పూరీ జగన్నాథ్ విషయానికి వస్తే.. గత కొంతకాలంగా వరుసగా డిజాస్టర్ లను చవి చూస్తున్న పూరీ జగన్నాథ్ సక్సెస్ కోసం ఆరాటపడుతున్నారు. ఒకప్పుడు ఎంతోమంది హీరోలకు ఈయన సక్సెస్ అందించారు. కానీ ఆ హీరోలు ఈయనతో ఇప్పుడు సినిమా చేయడానికి ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. మొత్తానికి అయితే మరో మంచి సినిమాతో గట్టి కం బ్యాక్ అవ్వాలని పూరీ జగన్నాథ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి పూరీ జగన్నాథ్ సినిమాలతో ఎప్పుడు సక్సెస్ అవుతారో చూడాలి.