అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత.. చాలా మంది ఫ్లైట్ జర్నీ అంటేనే భయంతో వణికిపోతున్నారు. ప్రతి ఒక్కరి మదిలో అవే దృశ్యాలు మెదులుతున్నాయి. ఆ ఘటనతో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఈ విమాన ప్రమాదంలో 242 మందిలో 241 మంది చనిపోవడంతో షాకయ్యింది. ఆ ప్రమాదం తర్వాత ఎప్పుడు విమానం ఎక్కినా అసౌకర్యంగా, భయంగా ఫీలవుతున్నట్లు రాశీ చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టింది.
విమాన ప్రయాణం అంటేనే ఆందోళనగా ఉంది!
తాజాగా విమాన ప్రయాణం చేసిన రాశీ ఖన్నా తన ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టింది. ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత ఫ్లైట్ జర్నీ అంటే ఎంతలా ఆందోళన కలుగుతుందో చెప్పుకొచ్చింది. విమాన ప్రమాదాలకు సంబంధించి తనతో ఎలా భయాన్ని కలిగిస్తున్నాయో వివరించే ప్రయత్నం చేసింది. ఈ మేరకు తన విమాన ప్రయాణానికి సంబంధించి కొన్ని ఫోటోలను పంచుకుంది. ఒకప్పుడు ఆహ్లాదంగా అనిపించిన విమాన ప్రయాణం ఇప్పుడు, భారీగా మారినట్లు వెల్లడించింది. “ప్రపంచంలో చాలా అశాంతి నెలకొని ఉంది. ప్రతి విమాన ప్రయాణం ఇప్పుడు భారంగా అనిపిస్తుంది. కేవలం ఆకాశం వల్ల కాదు. మనం క్యారీ చేసే హెడ్ లైన్స్ వల్ల. ఒకప్పుడు ప్రయాణ సమయాన్ని తగ్గించుకునేందుకు విమాన ప్రయాణం ఓ మార్గంగా కనిపించేది. ఇటీవల విమానం ప్రయాణం అంటే శ్వాస ఆగినంద పని అయినట్లు అనిపిస్తోంది. ప్రయాణ ఆందోళన నాలోనే ఉందా? మరెవరైనా అనుభవిస్తున్నారా?” అంటూ రాసుకొచ్చింది.
Read Also: యాంకర్ జాహ్నవి ఇప్పుడు ఏం చేస్తోంది? ఇండస్ట్రీకి అందుకే దూరమైందా?
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది దుర్మరణం
జూన్ 12న లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే గుజరాత్ అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ ప్రాంతంలో బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ కాంప్లెక్స్ పైకి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక్క ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా వాళ్లంతా మాంసపు ముద్దలుగా మారిపోయారు. వారి శవాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ పరీక్షల ఆధారంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విమాన ప్రమాదం పట్ల దేశ వ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చాలా మంది నాటి నుంచి విమాన ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా భయం భయంగానూ విమాన ప్రయాణాలు చేస్తున్నారు.
Read Also: 72 గంటలు నరకం చూపించిన ఎయిర్ ఇండియా.. దేశం కాని దేశంలో..