Mohan Babu.. జల్పల్లిలో మోహన్ బాబు(Mohan Babu) ఇంటిదగ్గర ఏర్పడిన ఉద్రిక్తత వాతావరణం అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. సినీ ప్రేక్షకులు, సినీ ప్రముఖులే కాదు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సంఘర్షణను చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో పెద్దగా మీడియా ముందుకు రాని వీరు, ఇప్పుడు అనూహ్యంగా గత రెండు రోజులుగా మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కుటుంబ గొడవలను రోడ్డుపైన చర్చించుకోవడమే అసలు కారణం. గతంలో మనోజ్ (Manoj)- విష్ణు(Vishnu) మధ్య గొడవలు ఉన్నా దీనిని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మోహన్ బాబు రంగంలోకి దిగడం , పెద్దకొడుకుతో కలిసి మనోజ్ కి అన్యాయం చేస్తున్నారనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
మీడియాపై మోహన్ బాబు దాడి..
ఇకపోతే తనకు, తన భార్య మౌనికకు రక్షణ కావాలని, అలాగే తన కూతుర్ని కూడా రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు మంచు మనోజ్. ఈ నేపథ్యంలోనే తన పాపను కలవడానికి ఇంటికి వెళ్తే, మోహన్ బాబు సిబ్బంది ఈయనపై దాడి చేసి చొక్కా కూడా చింపేశారు. ఇక మీడియా మిత్రులు మంచు వారింట్లో ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మీడియా టీవీ మైక్ లాక్కుని విచక్షణారహితంగా మీడియా మిత్రులపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో మీడియా మిత్రులు మోహన్ బాబు వల్ల తమకు ప్రాణహాని ఉందని, హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా, వీరి వాంగ్మూలం సేకరించిన పోలీసులు తాజాగా మోహన్ బాబుకి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మోహన్ బాబుకు నోటీసులు..
మీడియా ప్రతినిధులపై దాడి చేసిన కారణంగా.. సీనియర్ నటుడు మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10:30 గంటలకు సీపీ కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఆయన గన్ ను కూడా పోలీసులు సరెండర్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా బీపీ డౌన్ కావడంతో కింద పడిపోయిన మోహన్ బాబును హైదరాబాదులోని గచ్చిబౌలి ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక షాక్ తగలడంతో ఈ దెబ్బ నుంచి తేరుకుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగింది..
గత రెండు రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల గొడవలు తారాస్థాయికి చేరాయి. తండ్రి కొడుకులిద్దరూ పరస్పరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. దీనికి తోడు తండ్రి నుండి ప్రాణహాని ఉందని మనోజ్ , కొడుకు నుండి ప్రాణహాని ఉందని మోహన్ బాబు కంప్లైంట్ ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. అంతేకాదు మోహన్ బాబు విద్యానికేతన్ విద్యాసంస్థలలో ఇల్లీగల్ జరుగుతోందని, విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉన్నందుకే తనపై దాడి చేశారనే కోణంలో కూడా మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజమో.. ఎందుకు గొడవపడ్డారు అనే విషయాలు తెలియదు కానీ ప్రస్తుతం వీరు గొడవపడ్డ అంశాలు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఏది ఏమైనా ఒక్క చిన్న గొడవ మంచు ఫ్యామిలీని రోడ్డున పడేసిందని చెప్పవచ్చు.