ప్రముఖ బ్యూటీ రాధిక ఆప్టే (Radhika Apte)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి, అనతి కాలంలోనే తెలుగులో పలు సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా బాలయ్య నటించిన ‘లెజెండ్’ చిత్రంతో భారీ పాపులారిటీ అందుకున్న రాధిక ఆప్టే, లయన్, రక్త చరిత్ర, ధోని వంటి సినిమాలలో కూడా నటించి మెప్పించింది. ఒక తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, బెంగాలీ, తమిళ్, ఇంగ్లీష్, మరాఠీ వంటి భాషా చిత్రాలలో నటించి ఆకట్టుకుంది.
తల్లి అయిన వారానికే పని మొదలుపెట్టిన రాధిక..
ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2012లో బ్రిటిష్ వయోలినిస్ట్ బెండిక్ట్ టేలర్ తో ఏడడుగులు వేసింది. ఇకపోతే పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత ఈమె అమ్మ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. మొత్తానికి అయితే 12 ఏళ్ల తర్వాత తల్లి అవడంతో పలువురు సెలబ్రిటీలు అభిమానులు కూడా రాధికాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉండగా తల్లి అయిన తర్వాత మొదటి పని మొదలు పెట్టానని చెప్పి అందుకు సంబంధించిన ఒక పోస్ట్ ను కూడా షేర్ చేసింది రాధిక. అందులో బిడ్డకు ఒకవైపు పాలిస్తూనే, మరొకవైపు లాప్టాప్ తో వర్క్ చేస్తున్న ఫోటోని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అలాగే నా వారం వయసున్న బిడ్డకు నేను ఒకవైపు పాలు ఇస్తూనే , మరొకవైపు లాప్టాప్ ముందు నా వర్క్ మొదలు పెట్టాను.. అంటూ రాధిక క్యాప్షన్ జోడించింది.ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ డెలివరీ అయిన వారానికే పని ఏంటి మేడం అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇకపోతే రాధిక తన బేబీ ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు. మొత్తానికి అయితే రాధిక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ వర్క్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది.
రాధిక ఆప్టే కెరియర్..
రాధిక ఆప్టే విషయానికి వస్తే.. మరాఠీ నటి అయినప్పటికీ తెలుగు, హిందీ సినిమాలలో ఎక్కువగా నటించి భారీ పాపులారిటీ అందుకుంది. 1985 సెప్టెంబర్ 7న జన్మించిన ఈమె 39 సంవత్సరాల వయసులో తల్లి అవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈమె కుటుంబం సినిమాలతో సంబంధం లేని కుటుంబం. నాన్న చారుదత్త ఆప్టే పూణేలోనే కాదు మహారాష్ట్ర అంతటా పేరున్న నరాల వైద్యుడు. ఈమె అమ్మ జయశ్రీ ఆప్టే.. మత్తుమందు వైద్యనిపుణురాలు. ఇద్దరు తమ్ముళ్లు.. మొత్తం ముగ్గురు సంతానం.. రాధిక నృత్యం నేర్చుకొని రంగస్థలం మీద నటిస్తూ అటు నుంచి మరాఠీ రంగానికి, హిందీ సినిమా రంగానికి పరిచయమైంది. ఇకపోతే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈమె సినిమాలు చూసి, ఈమె యాక్టింగ్ కి ఫిదా అయ్యారు. అలా రాధిక ఆప్టేను ‘రక్త చరిత్ర’సినిమా ఆడిషన్ కి పిలిపించారు. తర్వాత ఆ సినిమాలో నటిస్తూ పరిచయమయ్యింది. ఇక సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈమె బాలకృష్ణ సినిమాతో మరింత పాపులారిటీ అందుకుంది.