Rajinikanth:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని, ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు రజినీకాంత్(Rajinikanth). ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలో కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన, అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏడు పదుల వయసు దాటినా సరే వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం కూలీ(Coolie).. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం థాయిలాండ్ వెళ్లారు. దాదాపు రెండు వారాల షూటింగ్ నిమిత్తం థాయిలాండ్ వెళ్ళిన రజనీకాంత్ అక్కడ షూటింగును కూడా మొదలుపెట్టారు. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
కూలీ సినిమాపై భారీ అంచనాలు..
దీనికి తోడు ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ తో దాదాపుగా పూర్తవుతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. మరొకవైపు ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి, ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుండగా.. అందులో భాగంగానే సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి పలువురు సీనియర్ స్టార్లను కూడా ఈ సినిమాలో భాగం చేస్తున్నట్లు సమాచారం.
రిపోర్టర్ పై రజినీకాంత్ అసహనం..
ఇకపోతే తాజాగా కూలీ సినిమా షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్లే ముందు.. చెన్నై ఎయిర్ పోర్టులో కొంత సమయం గడిపి, అక్కడికి వచ్చిన రిపోర్టర్స్ తో ముచ్చటించారు రజినీకాంత్. అందులో భాగంగానే సినిమాకు సంబంధించి.. రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు. అయితే ఎప్పుడైతే ఒక రిపోర్టర్ రాష్ట్రంలో మహిళల భద్రత గురించి మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించారో.. వెంటనే అసహనం వ్యక్తం చేశారు. అసలు మీరు మాట్లాడే మాటలకు సమయం సందర్భం ఉండదా? అంటూ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో అలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారు? అంటూ అక్కడ నుంచి రజినీకాంత్ వెళ్లిపోయారు. ఇది చూసిన కొంతమంది సినిమా గురించి మాట్లాడుతున్న ఈ సమయంలో అసలు ఆ విషయాలు ఎందుకు? అనే ఉద్దేశంతోనే రజినీకాంత్ అసహనం వ్యక్తం చేసి ఉంటారు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఏమైంది..
అసలేమైంది అనే విషయానికొస్తే.. చెన్నైలోనే అన్నా యూనివర్సిటీలో ఒక బాలికపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అటు అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా ఈ ఘటన వెనుక ఉన్నారు అని కొంతమంది విపక్ష నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఈ ఘటన గురించి స్పందించారు.అందులో భాగంగానే రజినీకాంత్ ను కూడా ఆ రిపోర్టర్ ఈ ఘటనపై స్పందించాల్సిందిగా కోరగా.. రజనీకాంత్ మాత్రం విదేశాలకు వెళ్లే హడావిడిలో ఉండి, దీని గురించి మాట్లాడే సమయం లేకనో లేక మరేదైనా కారణమో తెలియదు. కానీ ఈ విషయం గురించి అడిగిన రిపోర్టర్ పై మాత్రం ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.