Game Changer:సాధారణంగా అభిమానులు తమ అభిమాన హీరో నుండి సినిమా వస్తోందంటే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. ముఖ్యంగా మేకర్స్ ఆ సినిమా నుండి టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారా? ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? అది ఎలా ఉండబోతోంది? ఏ కాన్సెప్ట్ తో రాబోతోంది? అందులో తమ అభిమాన హీరో ఎలాంటి లుక్ లో కనిపించనున్నారు? ఇలా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈగర్ గా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే సహనం కోల్పోతారో.. ఒక్కసారిగా సోషల్ మీడియా లో మేకర్స్ పై దండయాత్రకు దిగుతారు. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకు వేస్తూ.. ఏకంగా సూసైడ్ లెటర్స్ రాస్తూ బెదిరిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది అభిమానులు తమ అభిమాన హీరోల సినిమాల గురించి ఎదురు చూస్తూ.. ఇలా సూసైడ్ లెటర్స్ రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలో కూడా గేమ్ ఛేంజర్ ట్రైలర్ మూవీ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న ఒక అభిమాని.. సహనాన్ని కోల్పోయి ఏకంగా సూసైడ్ లెటర్ రాసి అందరిని ఆశ్చర్యంలో ముంచేశాడు.
సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్..
అసలు విషయంలోకెళితే.. ప్రముఖ డైరెక్టర్ ఎస్.శంకర్ (S.Shankar), గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎఫ్ డి సి చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ((Dil Raju) నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara advani), అంజలి (Anjali) హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా.. సునీల్, సముద్రఖని, ఎస్ జె సూర్య తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
సూసైడ్ లెటర్ రాసిన రామ్ చరణ్ అభిమాని..
గేమ్ ఛేంజర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఇప్పటివరకు ట్రైలర్ విడుదల చేయలేదు. ట్రైలర్ కోసం ఈగర్ గా ఎదురు చూసిన ఒక అభిమాని సహనం కోల్పోయి, ఏకంగా సూసైడ్ లెటర్ రాసి మరీ షాక్ ఇచ్చారు. ఇక అందులో.. “గౌరవనీయులైన గేమ్ ఛేంజర్ గారికి, నేను అనగా ఈశ్వర్.. చరణ్ అన్న అభిమాని.. చింతిస్తూ వ్రాయునది ఏమనగా.. సినిమాకి ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీరు ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ట్రైలర్ అప్డేట్ ఇవ్వలేదు. కనీసం అభిమానుల ఎమోషన్స్ ను కూడా మీరు పట్టించుకోవట్లేదు. ఈనెల ఆఖరి కల్లా మీరు ట్రైలర్ అప్డేట్ గనుక ఇవ్వకపోతే, న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేయకపోతే, నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.. ఇట్లు మీ విధేయుడు, చరణ్ అన్న భక్తుడు, ఈశ్వర్” అంటూ ఆ లెటర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మేకర్స్ కాస్త ఆశ్చర్యంలో పడినట్లు తెలుస్తోంది. ఒక అభిమాని సూసైడ్ లెటర్ అంటే అందరూ భయాందోళనకు గురవుతున్నారు
మరి మేకర్స్ వెంటనే దీనిపై యాక్షన్ తీసుకొని ట్రైలర్ అప్డేట్ ఇస్తారేమో చూడాలి.. ఏది ఏమైనా సెలబ్రిటీలపై అభిమానం ఉండాలి కానీ సెలబ్రిటీల సినిమాల కోసం ప్రాణం తీసుకునే అంత పిచ్చి ఉండకూడదని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.