Indian Railways: భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2025 నుంచి కొత్త టైమ్ టేబుల్ ను అమల్ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్’ 44వ ఎడిషన్ డిసెంబర్ 31తో ముగిస్తుంది. ఆ వెంటనే కొత్త టైమ్ టేబుల్ అందుబాటులోకి రానుంది. గత ఏడాది రైల్వే సంస్థ ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్ – ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ (TAG)ను రిలీజ్ చేసింది. ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సాధారణంగా, రైల్వే మంత్రిత్వ శాఖ ‘ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్’ (TAG) టైమ్ టేబుల్ ను ప్రతి సంవత్సరం జూన్ 30కి ముందు విడుదల చేస్తుంది. కొత్త టైమ్ టేబుల్ జూలై 1 నుండి అమల్లోకి వస్తుంది. అయితే, ఈ సంవత్సరం నిబంధనలు సవరించబడ్డాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లకు సంబంధించిన సమయాలను సవరిస్తూ కొత్త టైమ్ టేబుల్ అందుబాటులోకి రానుంది.
2025లో అందుబాటులోకి 136 వందేభారత్ రైళ్లు
ఇక 2025లో భారతీయ రైల్వే సంస్థ మొత్తం 136 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, 2 అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఒక నమో భారత్ ర్యాపిడ్ రైలు (వందే మెట్రో)ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నది. గత సంవత్సరం, ప్రయాణీకులు సౌకర్యాన్ని పెంచేందుకు జాతీయ రవాణా సంస్థ 64 వందే భారత్ రైళ్లను 70 అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక జనవరి నుంచి అందుబాటులోకి వచ్చే కొత్త రైల్వే టైమ్ టేబుల్ లో ఏ అంశాలు ఉంటాయి? కొత్తగా ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటాయా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంటుంది.
కుంభమేళా భక్తులకు IRCTC ప్రపంచ స్థాయి సౌకర్యాలు
అటు జనవరి నుంచి ఉత్తర ప్రదేశ్ లో జరిగే మహా కుంభమేళాకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నది. ఈవెంట్ కు హాజరయ్యే లక్షలాది మంది భక్తుల కోసం ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించబోతున్నది. సుమారు 3,000 ప్రత్యేక రైళ్ల నడపడంతో పాటు 1 లక్ష మంది ప్రయాణీకులకు ఆశ్రయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అంతేకాదు, త్రివేణి సంగమం సమీపంలో మహాకుంభ్ గ్రామ్ అనే లగ్జరీ టెంట్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేసింది IRCTC. రైళ్లలో మహా కుంభమేళాకు వచ్చిన భక్తులు ఇందులో బస చేసే అవకాశం కల్పించనుంది.
జనవరి 10 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్ లైన్ బుకింగ్స్
ఇక త్రివేణి సంగమం సమీపంలోని మహాకుంభ్ గ్రామ్ లో బస చేయడానికి రైల్వే ప్రయాణీకులు ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. IRCTC వెబ్ సైట్ ద్వారా ఈజీగా రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. IRCTC, పర్యాటక శాఖ వెబ్ సైట్లతో పాటు Mahakumbh యాప్ లోనూ మహాకుంభ్ గ్రామ్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.
Read Also: సంక్రాంతి వేళ తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఏపీకి 5 వేల స్పెషల్ బస్సులు!