Game Changer : సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లను గట్టిగానే నమ్ముతుంటారు నటీనటులు. కోట్లతో కూడుకున్న వ్యవహారం కాబట్టి సినిమా ముహూర్తం దగ్గర నుంచి రిలీజ్ డేట్ వరకు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఎప్పుడైనా సినిమాల విషయంలో బ్యాడ్ సెంటిమెంట్ ఏర్పడిందంటే, దశాబ్దాలు గడిచినా సరే దాన్ని మరవడం కష్టం. గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మహేష్ బాబు (Mahesh Babu) లాంటి స్టార్ హీరోలకు జనవరి పీడకలుగా మిగిలింది. దీంతో తాజాగా జనవరిలో రిలీజ్ కాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ విషయంలో ఈ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ? అనే భయంతో వణికిపోతున్నారు మెగా ఫ్యాన్స్.
పవన్, మహేష్ లకు కలిసిరాని జనవరి
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలన్నీ జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అవ్వడం అన్నది చాలాకాలంగా ఆనవాయితీగా వస్తుంది. అయితే ఒకసారి సినిమా హిట్ అయితే, మరోసారి ప్లాఫ్ అవ్వచ్చు. అది సినిమా రిలీజ్ డేట్ ని బట్టి కాదు, కంటెంట్ ని బట్టి ఉంటుంది. అయినప్పటికీ ఒక్కసారి మరిచిపోలేని దెబ్బ పడింది అంటే, మరోసారి అదే రిలీజ్ డేట్ కి కంటెంట్ బాగున్నా సరే సినిమాను రిలీజ్ చేయడానికి ధైర్యం చేయలేరు మేకర్స్, హీరోలు.
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ‘అజ్ఞాతవాసి’ (Agnathavasi). ఈ సినిమాని చూశాక త్రివిక్రమ్ ను ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఆ తర్వాత చాలాకాలం పాటు త్రివిక్రమ్ సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ గా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో ప్రశంసలు అందుకుంటున్న డైరెక్టర్ సుకుమార్ కు కూడా జనవరి దెబ్బేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన మూవీ ‘వన్ నేనొక్కడినే’ ( 1 Nenokkadine). ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆశ్చర్యకరంగా ఆ తర్వాత ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంది అనే ప్రశంసలు కూడా వినిపించాయి. ఏదైతేనేం మూవీ డిజాస్టర్ కావడంతో అటు మహేష్ బాబు, ఇటు సుకుమార్ కు గట్టి దెబ్బ పడింది. దీంతో ఆ తర్వాత సుకుమార్ – మహేష్ బాబు కాంబినేషన్లో పట్టాలు ఎక్కాల్సిన మరో ప్రాజెక్ట్ అటకెక్కింది.
ఇక షాకింగ్ విషయం ఏంటంటే అజ్ఞాతవాసి, వన్ నేనొక్కడినే రెండు సినిమాలు కూడా జనవరి 10నే రిలీజ్ అయ్యి… పవన్, మహేష్ బాబుల కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలాయి.
‘గేమ్ ఛేంజర్’ను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్
ఈ నేపథ్యంలోనే కరెక్ట్ గా అదే రిలీజ్ డేట్ కి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ రిలీజ్ అవుతుండడంతో ఆందోళన నెలకొంది. రామ్ చరణ్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, ‘గేమ్ ఛేంజర్’ మూవీ మొదటి నుంచి ట్రోలింగ్ ను ఎదుర్కొంటుంది. సినిమా అప్డేట్స్ లేట్ అవ్వడం, ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడం దగ్గర నుంచి మొదలుపెడితే పాటల వరకు… ప్రతి విషయంలోనూ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. మరి రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాను జనవరి 10 అనే ఈ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుందా? లేదంటే ఆ మిత్ ను చెర్రీ బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి.