Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), శంకర్ కాంబినేషన్లో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్, టీజర్ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. మరి ఇంతటి భారీ అంచనాలున్న ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలన్నా, నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాలన్నా ఎంత రాబట్టాలి? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే విషయాలను తెలుసుకుందాం.
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ లతో పాటు ఈవెంట్స్, ప్రొడక్షన్ ఖర్చులు, సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఖర్చులను కూడా కలుపుకొని మొత్తం 500 కోట్ల బడ్జెట్ ను ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. ‘వినయ విధేయ రామ’ తర్వాత సుమారు ఐదేళ్ల గ్యాప్ ఇచ్చి, రామ్ చరణ్ సోలోగా వస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓటిటి అండ్ సాటిలైట్ రైట్స్ కలిపి దాదాపు 200 కోట్లకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే… తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమా హిందీ, తమిళ, కన్నడ, ఓవర్సీస్ అంతా కలిపి బిజినెస్ 180 కోట్లు జరిగిందని టాక్ నడుస్తోంది. ఓవర్సీస్ లో 4.5 మిలియన్ల డాలర్ల మేర డీల్ కుదిరినట్టు సమాచారం. మొత్తంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 300 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. దీంతో ‘గేమ్ ఛేంజర్’ ముందు భారీ టార్గెట్ ఉన్నట్టుగా అయ్యింది.
నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న మూవీ ఇది. ప్రస్తుతం ఆయనకి గ్లోబల్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఇది అంతగా కంగారు పడాల్సిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే కాదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈజీగా 300 కోట్లు రాబడతాడు చెర్రీ. కానీ నెగిటివ్ టాక్ వస్తేనే ఈ భారీ టార్గెట్ ను రీచ్ అవ్వడం కష్టమవుతుంది. ఇప్పటికైతే మూవీ సెన్సార్ టాక్, ఫస్ట్ రివ్యూ లాంటివి అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. ఇక జనాల తీర్పు కూడా పాజిటివ్ గానే ఉంటే చెర్రీ రాజమౌళి సెంటిమెంట్ గండం గట్టెక్కినట్టే. రాజమౌళితో సినిమా చేసిన హీరోలు ఆ తర్వాత డిజాస్టర్ అందుకుంటారు అన్న టాకు ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో మరో హీరోగా నటించిన తారక్ ‘దేవర’ మూవీతో ఈ మిత్ ని బ్రేక్ చేశారు. ఇక ఇప్పుడు చెర్రీ వంతు.