Hyderabad City: న్యూ ఇయర్ వచ్చిందని మద్యం సేవించి, బైక్ పై రయ్.. రయ్ అంటూ వస్తున్నారు ఇద్దరు యువకులు. మద్యం మత్తులో ఎలా బైక్ నడుపుతున్నారో వారికే తెలియదు. ఎదురుగా డివైడర్ ఉంది. కానీ బైక్ వేగంలో మాత్రం మార్పు లేదు. స్పీడ్ గా బైక్, డివైడర్ దగ్గరికి రానే వచ్చింది. మత్తులో ఉన్న బైక్ నడిపే యువకుడు నేరుగా డివైడర్ కే ఢీ కొట్టాడు. ఇద్దరు ఎగిరి రహదారిపై బలంగా పడ్డారు. చేతులు, కాళ్లు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ఇంకేముంది కుటుంబసభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు.
మద్యం మత్తులో వాహనాలు నడిపితే పైన తెలిపినట్లుగా, ప్రమాదాల బారిన పడాల్సిందే అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. న్యూ ఇయర్ సంబరాలు సంతోషంగా జరుపుకోండి కానీ, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ రానున్న సందర్భంగా తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. డీజీపీ జితేందర్ ఆదేశాల మేరకు ఇప్పటికే పలు ఆంక్షలను సైతం పోలీసులు ప్రకటించారు.
న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు, సాయంత్రం నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను పోలీసులు నిర్వహిస్తారు. రాత్రి 10 గంటల తర్వాత హైదరాబాద్ లోని ఫ్లైఓవర్స్ ను మూసివేస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు తెలిపారు. ఫ్లై ఓవర్స్ పై బైక్ రేసింగ్ లు జరుగుతాయన్న కారణంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలకు శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ వైపుకు వచ్చే వాహనాలను పోలీసులు మళ్లిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ పరిధిలో కేవలం 60 ఈవెంట్స్ కు మాత్రమే అనుమతినిచ్చినట్లు, నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని తెలంగాణ పోలీసులు కోరారు.
Also Read: Hyderabad City: హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. రేపు రాత్రి ఈ సర్వీస్ మీకోసమే!
అలాగే కొత్త సంవత్సర వేడుకల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇవి చేయకూడదంటూ పోలీసులు ప్రకటన జారీ చేశారు. మద్యం తాగి వాహనాలను నడపకూడదని, రోడ్లపై మద్యం తాగటం కేక్ కటింగ్ లాంటివి చేయకూడదన్నారు. డీజేలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్ జోలికి వెళ్లవద్దని, డ్రగ్స్ ఉన్న పార్టీలలో పాల్గొన్న కూడా ఇబ్బందులు తప్పవని తెలంగాణ పోలీసులు అధికారికంగా ట్వీట్ చేశారు.
కాగా ఇప్పటికే డిసెంబర్ 31 రాత్రి మద్యం ప్రియులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే మెట్రో కూడా అర్ధరాత్రి వరకు సేవలు అందించనుంది.