Rashmika Mandanna: చాలావరకు హీరోయిన్స్ తమకు క్రేజ్ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులకు ఎక్కువగా కనిపించి ఫేమ్ సంపాదించుకోవాలని అనుకుంటారు. కానీ ఆ సినిమాలు అన్నీ వర్కవుట్ అయితేనే వారికి మార్కెట్ పెరగడంతో పాటు మరిన్ని అవకాశాలు కూడా వస్తాయి. అలా సక్సెస్‌ను జాగ్రత్తగా కాపాడుకుంటూ, మంచి కథలు సెలక్ట్ చేసుకుంటూ ముందుకెళ్లే హీరోయిన్స్ సంఖ్య చాలా తక్కువ. అలాంటి అన్నీ కరెక్ట్‌గా మ్యానేజ్ చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అనే రేంజ్ సంపాదించుకుంది రష్మిక మందనా. తాజాగా ‘ఛావా’ అనే భారీ బడ్జెట్ హిందీ మూవీలో నటించిన రష్మిక.. దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
చాలా సంతోషం
విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ హిస్టారికల్ చిత్రమే ‘ఛావా’ (Chhaava). చాలాకాలంగా విడుదలను పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమా.. ఫైనల్‌గా రిలీజ్‌కు సిద్ధమయ్యింది. అందుకే ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు మేకర్స్. తన కాలికి గాయమయినా కూడా మొహం మీద చిరునవ్వు చెరిగిపోకుండా వీల్ చైర్‌లోనే ఈవెంట్‌కు అటెండ్ అయ్యింది రష్మిక మందనా. అంతే కాకుండా కష్టపడి కుంటుతూ నడుస్తూ నిలబడి ‘ఛావా’లో నటించడంపై సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పటికే విడుదలయిన పోస్టర్స్, ట్రైలర్‌లో కూడా రష్మిక లుక్‌కు మంచి మార్కులు పడడంపై కూడా తాను స్పందించింది.
నచ్చుతుందని ఆశిస్తున్నాను
‘‘నా జీవితం మొత్తం కష్టపడిన ఇలాంటి సినిమా మళ్లీ చేస్తానని అనుకోవడం లేదు. ఈ సినిమా తర్వాత నేను సంతోషంగా రిటైర్ అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని నేను ఇప్పుడే డైరెక్టర్ లక్ష్మణ్‌తో చెప్పాను. అసలు ఈ పాత్రకు నన్ను తీసుకోవాలని లక్ష్మణ్ ఎందుకు అనుకున్నారో నాకు తెలియలేదు. కానీ ఇది నేను ప్లే చేసిన స్పెషల్ పాత్రల్లో ఒకటిగా గుర్తుండిపోతుంది. నేను నా బెస్ట్ చేశానని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇది నాకు చాలా పర్సనల్, నాకు చాలా క్లోజ్ అని ఫీలయ్యాను. ఎందుకంటే ఈరోజు ఛావా చూసినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి’’ అని సంతోషం వ్యక్తం చేసింది రష్మిక మందనా (Rashmika Mandanna).
Also Read: పెళ్లి ప్రణాళికలు వేసుకుంటున్న జాన్వీ.. అలాంటి వాడే కావాలంటూ మాస్టర్ ప్లాన్..!
అందరికీ థాంక్యూ
మరాఠా అమ్మాయి కాకపోయినా ‘ఛావా’లో అవకాశం రావడం, తనను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడంపై కూడా రష్మిక కామెంట్స్ చేసింది. ‘‘నేను మరాఠాలకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఒక్కదాన్ని అయిపోయాను. మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారని భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది రష్మిక. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్, రష్మిక మందనా నటించిన చిత్రమే ‘ఛావా’. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, దివ్య దత్తా, డయానా పెంటీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరీ 14న ‘ఛావా’ విడుదలకు సిద్ధమయ్యింది.