Rajini and Ajith : రీ-రిలీజ్ ఇప్పుడొక ట్రెండ్. టాప్ హీరోల సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తూ.. ఇదీ మావోడి గొప్ప అంటూ చాటుకుంటున్నారు ఫ్యాన్స్. అఫ్‌కోర్స్.. రిలీజ్ చేసేది ప్రొడ్యూసర్లే అయినా.. ఫ్యాన్స్ హంగామా, వారి సపోర్ట్ చూసే రీ రిలీజ్ చేస్తున్నారు. బర్త్‌డేల రోజున హీరో సినిమా గనక విడుదల కాకపోతే.. ఆ స్పేస్‌ను భర్తీ చేసేందుకు పాత సినిమాలను మళ్లీ తెర మీదకి తీసుకొస్తున్నారు. తెలుగులో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలను ఇలాగే రిలీజ్ చేశారు.. రికార్డ్ కలెక్షన్స్ రాబట్టారు. ఇప్పుడిదే ట్రెండ్ తమిళ్‌లోనూ కంటిన్యూ అవుతోంది.
రీ-రిలీజ్‌లో కోలీవుడ్ టాప్ హీరోలు సూపర్ స్టార్ రజనీకాంత్, తల అజిత్ కుమార్ పోటీ పడుతున్నారు. వీళ్లిద్దరు నటించిన రెండు పాత సినిమాలను డిజిటలైజ్ చేసి మళ్లీ రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ రెండింట్లోనూ ఇంట్రస్టింగ్ మూవీ రజనీకాంత్‌దే. రాధికా ఆప్టేతో కలిసి నటించిన కబాలి సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. 2016లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్యాన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. కాని, ఈ సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. కబాలి క్లైమాక్స్‌లో కొన్ని మార్పులు చేసి, మూవీ రన్నింగ్ టైమ్‌ను తగ్గించి దీపావళికి రీ-రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్ రెడీ అయ్యారు.
అటు అజిత్ కుమార్ నటించిన ఫస్ట్ మూవీ అమరావతిని రీ-రిలీజ్ చేయబోతున్నారు. అజిత్ కుమార్ బర్త్ డే సందర్భంగా అమరావతి సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమరావతి పాత వెర్షన్‌ను డిజిటలైజ్ చేసి, మే మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేపట్టారు. అమరావతి రీ రిలీజ్‌కు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు సహకరించాలని ఇప్పటికే నిర్మాత చోళ పొన్నురంగం రిక్వెస్ట్ కూడా చేశాడు.
రజినీ కాంత్, అజిత్ కుమార్ సినిమాలు రీ-రిలీజ్ చేస్తుండడంతో మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఒత్తిడి పెంచుతున్నారు. గతంలో మంచి హైప్ క్రియేట్ అయి సరిగా ఆడలేక సినిమా అయినా, లేక రికార్డులు కొల్లగొట్టిన సినిమా అయినా సరే.. మళ్లీ రిలీజ్ చేస్తే రికార్డ్ కలెక్షన్స్ రప్పించే బాధ్యత తీసుకుంటామని హీరోల అభిమానులు ప్రొడ్యూసర్లపై ఒత్తిడి చేస్తున్నారు.