Recap 2024 : ఈ ఏడాది టాలీవుడ్లో పెద్ద సినిమాలతో పాటు, పలు చిన్న సినిమాలు కూడా బెస్ట్ సినిమాలుగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాయి. అయితే అందులోనూ ఎక్కువగా పాన్ ఇండియా స్టార్ల హడావిడి ఎక్కువగా కనిపించింది. ఈ ఏడాది చాలామంది యంగ్ హీరోల సినిమాలు రిలీజ్ కాకపోవడం గమనార్హం. కొంతమంది హీరోలు ఇదిగో వస్తున్నాం… థియేటర్లలోకి అదుగో వస్తున్నాం… అంటూ ఊరించి, చివరికి సైలెంట్ అయిపోయారు. మరికొందరైతే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గ కథలను ఎంచుకోవడంలోనే ఇంకా బిజీగా ఉన్నారు. మరి ఈ ఏడాది సినిమాలు రిలీజ్ చేయని యంగ్ హీరోలు ఎవరో ఒక లుక్కేద్దాం పదండి.
నాగచైతన్య (Naga Chaitanya)
గత ఏడాది ‘కస్టడీ’ మూవీతో నిరాశ పరిచిన నాగచైతన్య ఆ తర్వాత ‘ధూత’ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ హీరో ‘తండేల్’ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ‘తండేల్’ మూవీ నిజానికి 2024 డిసెంబర్లోనే థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ పలు అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఫిబ్రవరి 7 కు వాయిదా పడింది. అలాగే కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చే ఏడాది మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగచైతన్య.
అడివి శేష్ (Adivi Sesh)
టాలీవుడ్ లో ఉన్న మరో టాలెంటెడ్ హీరో అడివి శేష్. ఈ హీరో బిగ్ స్క్రీన్ పై కనిపించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. చివరగా మేజర్, హిట్ 2 సినిమాల్లో కనిపించిన అడివి శేష్ చాలా గ్యాప్ తీసుకొని ‘గూడచారి’ సీక్వెల్ గా ‘జీ 2’, ‘డెకాయిట్ : ఏ లవ్ స్టోరీ’ అనే సినిమాలతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం ఆయన నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.
నితిన్ (Nithin)
చాలా కాలంగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న నితిన్ ప్రస్తుతం ‘రాబిన్ హుడ్’తో పాటు తమ్ముడు, ఎల్లమ్మ అనే సినిమాలను చేస్తున్నారు. అయితే డిసెంబర్ 25న రిలీజ్ కావాల్సిన నితిన్ ‘రాబిన్ హుడ్’ వాయిదా పడిందని ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఈ ఏడాది నితిన్ తెరపై కనిపించడం కూడా వాయిదా పడింది.
సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej)
చివరగా ‘బ్రో’ సినిమాతో పలకరించిన సాయి దుర్గ తేజ్ ఈ ఏడాది ఒక్క సినిమాను కూడా తన అభిమానులకు అందించలేకపోయారు. ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
కళ్యాణ్ రామ్ (Kalyan Ram)
గత ఏడాది అమిగోస్, డెవిల్ అనే రెండు సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కళ్యాణ్ రామ్. కానీ ఈ రెండు సినిమాలు కూడా బెడిసి కొట్టాయి. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ 21వ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ హీరోలతో పాటు నాగశౌర్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నవీన్ పోలిశెట్టి, అఖిల్ అక్కినేని, వైష్ణవ్ తేజ్ వంటి యంగ్ హీరోల నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు.