Indian Woman – Pakistan : తండ్రి లేని పిల్లల పోషణకు దేశం విడిచి వెళ్లిందో తల్లి.. వంట మనిషిగా దుబాయ్ లో పనిచేస్తూ నాలుగు డబ్బులు సంపాదించి పిల్లలకు పంపాలనుకుంది. ఇక్కడి ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు కష్టమైనా కన్న బిడ్డల్ని ప్రేమకు దూరంగా.. ప్రయాణమైంది. సరిగ్గా 22 ఏళ్ల క్రితం వెళ్లిన ఆమె.. ఏజెంట్ మోసంతో పాకిస్థాన్ లో చిక్కుకుపోయింది. దిక్కుతోచని స్థితిలో అక్కడే ఉండిపోయిన ఆ తల్లి.. చివరికి సోషల్ మీడియాలో ఓ యూట్యూబర్ పోస్టు కారణంగా స్వదేశానికి చేరుకుంది. ఇక్కడ తన బిడ్డల దగ్గరకు సురక్షితంగా చేరుకుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ వెల్లడించగా.. చాలా మందిని కన్నీళ్లు పెట్టిస్తోంది.
ముంబయికి చెందిన హమీదా బానో అనే మహిళకు పెళ్లై నలుగురు పిల్లలు. ఆ సమయంలో ఆమె భర్త మరణించడంతో.. ఒంటరైపోయింది. నలుగురు పిల్లల్ని ఎలా పోషించాలో తెలియని స్థితిలో.. దుబాయ్, ఖతార్ వంటి దేశాల్లో వంట మనిషిగా వెళితే మంచి భవిష్యత్ ఉంటుందని అని ఎవరో చెప్పారు. అక్కడికి వెళ్లి, వేలు సంపాదించవచ్చని.. ఆ డబ్బుని ఇక్కడికి పంపిస్తే పిల్లలు భవిష్యత్ బాగుంటుందని చెప్పారు. పిల్లల కోసం.. తెలియని దేశాని వెళ్లేందుకు సిద్ధమైంది హమీదా. తెలిసిన ఎజెంట్ సాయంతో విదేశానికి బయలు దేరింది. పిల్లల బాగోగుల్ని ఇక్కడి బంధువులకు అప్పగించి.. భారమైన గుండెతో.. మళ్లీ వస్తాను అంటూ వెళ్లింది. ఇక అంతే.. ఇప్పటి వరకు మళ్లీ తన పిల్లల్ని కలిసిందే లేదు. ఎందుకంటే..
దుబాయ్ తీసుకువెళతామని చెప్పిన తీసుకెళ్లిన ఏజెంట్ మోసం చేసారు. దాంతో.. ఆమె పాకిస్థాన్ లోని హైదరాబాద్ చేరుకుంది. అక్కడి నుంచి ఎలా భయటపడాలో తెలియక.. గత 22 ఏళ్లుగా హమీదా బానో అక్కడే చిక్కుకుపోయారు. భారత్ కి తిరిగి రావాలని, ఇక్కడి తన బిడ్డల్ని చూసుకోవాలని ఉన్నా.. ఎలా తిరిగి రావాలో తెలియని పరిస్థితి. దాంతో.. గుండెల నిండా భారాన్ని మోస్తూ అక్కడే ఇన్నాళ్లు కాలం గడిపేశారు.
తిరిగి తన బిడ్డల దగ్గరకు చేరడం కలలో కూడా జరగదని ఆశలు వదిలేసుకున్న ఆమెకు.. యూట్యూబర్ రూపంలో అదృష్టం కలిసివచ్చింది. 2022లో వలీవుల్లా మరూఫ్ అనే యూట్యూబర్ తన బ్లాగ్ కోసం ఆమెను పలకరించాడు. ఆమె తన జీవితం, అక్కడికి ఎలా వచ్చిందో తెలపడంతో హమీదా బానో విషయం వైరల్ గా మారింది. ఈ వీడియోను.. భారత్ లోని ఆమె కుటుంబ సభ్యులు చూడడంతో యూట్యూబర్ ని సంప్రదించారు. ఆమెను తిరిగి భారత్ కు తిరిగి వచ్చేలా ఏర్పాటు చేసారు. ఇక్కడి తన సంతానంతో 22 ఏళ్ల తర్వాత మాట్లాడిన హమీదా.. ఉద్వేగానికి గురైయ్యారు. ఎప్పుడెప్పుడు తన పిల్లల్ని చూసుకుందామా అని ఆరాటపడ్డారు.
విషయం మన విదేశాంగ శాఖ అధికారులకు తెలియడంతో.. పాక్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఆమె అంగీకరం తెలిపిన తర్వాత పాకిస్థాన్ నుంచి కరాచీకి.. అక్కడి నుంచి లాహోర్‌లోని వాఘా సరిహద్దు మీదుగా స్వదేశానికి చేరుకున్నారు. ఈమేరకు విదేశాంగ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. తన కుటుంబసభ్యులను మళ్లీ కలిసినందుకు బానో ఆనందం వ్యక్తం చేశారు. భారత్‌కు తిరిగివస్తాననే ఆశ కోల్పోయానని.. అలాంటి పరిస్థితుల్లో తిరిగి రావడం నమ్మశక్యంగా లేదంటూ సంతోష పడిపోతున్నారు.
Also Read : జమిలి ‘బిల్లు’కు లైన్ క్లియర్? లోక్‌సభలో ఓటింగ్.. అంత మంది వ్యతిరేకించినా..
22 ఏళ్లుకు పైగా పాకిస్థాన్‌లో ఉన్న హమీదా బానో.. అక్కడ ఉన్న సమయంలో కరాచీకి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయనతోనే ఇన్నాళ్లు ఉంటుండగా.. కొవిడ్ సమయంలో ఆ వ్యక్తి మరణించారని హమీదా వెల్లడించారు.