Regina Cassandra.. ఒకప్పుడు దక్షిణాది పరిశ్రమలో వరుస సినిమాలు చేసి తనకంటూ మంచి క్రేజ్ దక్కించుకున్న ప్రముఖ నటి రెజీనా కసాండ్రా (Regina Cassandra) తాజాగా బాలీవుడ్ పరిశ్రమను ఉద్దేశించి, చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమలో దక్షిణాది తారలకు ఉండే అవకాశాల గురించి, ఆమె ఇటీవల పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. “బాలీవుడ్ వాళ్లకు ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే గతంలో గడ్డు పరిస్థితులు చాలా ఉండేవి. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన తారలకు అక్కడ అవకాశాలు దొరకడం కూడా కష్టంగా మారిపోయింది”.
అప్పట్లో సౌత్ వాళ్లంటే బాలీవుడ్ లో చిన్న చూపు.
“అప్పట్లో సౌత్ వాళ్ళు బాలీవుడ్ కి వెళ్తే.. మీరు సౌత్ నుంచి వచ్చారు అని అవకాశాలు కూడా ఇచ్చేవారు కాదు.. సౌత్ వాళ్లు అంటూ చాలా చిన్న చూపు చూసేవారు.దానికి భాషా పరమైన ఇబ్బందులు కూడా ఒక కారణమై ఉండవచ్చు
కానీ కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సౌత్ కి చెందిన సినీ తారలకు ఇప్పుడు బాలీవుడ్ తారలు అవకాశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా తమ చిత్రాలను ఎక్కువ మంది ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడం కోసం దక్షిణాది తారలనే ఎంచుకోవడం అత్యవసరంగా మారిపోయింది.” అంటూ బాలీవుడ్ తారలను ఉద్దేశించి కామెంట్లు చేసింది రెజీనా కసాండ్రా.
రెజీనా కసాండ్రా సినిమాలు..
ఇక అలాగే బాలీవుడ్లో ప్రాజెక్టులు చేయడంపై కూడా ఆమె మాట్లాడింది. ఇప్పటివరకు తాను ఇలాంటి ఇబ్బందులు ఏవి ఎదుర్కోలేదని, తాను ఒక బాలీవుడ్ ప్రాజెక్టుకి ప్రస్తుతం సంతకం చేసానని, త్వరలోనే దాని విషయాలు కూడా చెబుతానని తెలిపింది. ఇక రెజీనా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రముఖ హీరో అజిత్ (Ajith) హీరోగా, దర్శకుడు మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో త్రిష(Trisha ) హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘విదాముయార్చి’. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అర్జున్ కీలక పాత్ర పోషిస్తూ ఉండగా.. ఆయనకు జోడిగా రెజీనా నటిస్తోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమా విశేషాలు పంచుకుంటుంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని, ఈ సినిమా డైరెక్టర్ అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించారని కూడా రెజీనా తెలిపింది..
తన పాత్ర పై క్లారిటీ ఇచ్చిన రెజినా..
అలాగే ఈ సినిమాలో తన పాత్ర గురించి కూడా మాట్లాడుతూ..” ఈ సినిమా ప్రమోషనల్ వీడియోలు చూసి చాలామంది నా పాత్ర గురించి చర్చించుకుంటున్నారు. నాది నెగిటివ్ రోల్ ? లేదా పాజిటివ్ రోల్ ? అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నా పాత్ర గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం నాకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.” అంటూ తెలిపింది రెజీనా. ఇక ఈ సినిమా కోసం తనను సంప్రదించినప్పుడు ఇంకో పాత్ర గురించి చెప్పారని, ఆ తర్వాత ఇప్పుడు చేసిన పాత్ర గురించి ఆఫర్ చేశారని కూడా తెలిపింది. మొత్తానికైతే రెజీనా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే, ఈమెకు మళ్ళీ అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు.