Regina cassandra: ప్రముఖ నటి రెజీనా కాసాండ్రా (Regina cassandra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె, పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి కూడా వెనకాడదు. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) పై ఊహించని కామెంట్లు చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రెజీనా సినీ ప్రయాణం..
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) బావమరిది ప్రముఖ హీరో సుధీర్ బాబు (Sudheer babu) నటించిన శివ మనసులో శృతి (SMS) అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రెజీనా కసాండ్రా. మొదటి సినిమాలోనే తన అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె , ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అవేవీ కూడా ఈమెకు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు. తెలుగులో చివరిగా ‘నేనే నా’ అనే సినిమాలో నటించింది.ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) హీరోగా త్రిష (Trisha) హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ‘విడాముయార్చి’. ఇందులో అర్జున్ (Arjun) కీలక పాత్ర పోషిస్తూ ఉండగా.. అర్జున్ కి జోడీగా రెజీనా నటిస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో రెజీనా చురుగ్గా పాల్గొంటూ.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది.
శివ కార్తికేయన్ మనిషిగా మాత్రం మారలేదు.
అందులో భాగంగానే శివ కార్తికేయన్ గురించి మాట్లాడుతూ.. “శివ కార్తికేయన్ ఇంత పెద్ద హీరో అవుతాడని నేను అనుకోలేదు. నేను, శివ కలసి ‘కేడీ బిల్లా కిలాడీ రంగా’ అనే సినిమాలో నటించాను. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 12 ఏళ్ళు అవుతోంది. శివ కార్తికేయన్ ఆ సినిమా సమయంలో ఎలా ఉన్నారో? ఇప్పటికి కూడా అలాగే ఉన్నారు. ముఖ్యంగా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ ఆయన ఈ స్థాయి హీరో ఎలా అయ్యాడనేదే నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అదంతా చాలా కష్టం. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు కానీ శివ కార్తికేయన్ మనిషిగా మాత్రం ఏం మారలేదు. ఆయన చాలా గొప్పవాడు” అని రెజీనా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రెజీనా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అమరన్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు..
శివ కార్తికేయన్ విషయానికి వస్తే.. ముఖ్యంగా విభిన్నమైన జానర్లతో ఇన్ని రోజులు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఇప్పుడు ‘అమరన్’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్నారు. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన అమరన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో శివ కార్తికేయన్ కు జోడిగా సాయి పల్లవి (Sai Pallavi) కూడా నటించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని అలరించింది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా శివ కార్తికేయన్ కూడా తన అద్భుతమైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.