Aamir Khan : ‘బాహుబలి’ మూవీ వచ్చేదాకా భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అని గొప్పలు పోయిన పలువురు హిందీ నటులు ఇప్పుడు దిగివస్తున్నారు. సౌత్ దర్శకుల టాలెంట్ చూసి, వాళ్లతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ తో కలిసి ‘యానిమల్’ మూవీ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పిలుచుకునే అమీర్ ఖాన్ (Aamir Khan) తెలుగు డైరెక్టర్ పై ఆశలన్నీ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. వరుస డిజాస్టర్ల కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అమీర్ ఖాన్, ఇప్పుడు తెలుగు డైరెక్టర్ దర్శకత్వంలో రానున్న మూవీతో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) 2022 ఆగస్టులో ‘లాల్ సింగ్ చద్దా’ అనే సినిమాతో ప్రేక్షకులను చివరగా పలకరించారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ మూవీ మిగిల్చిన నిరాశతో కొన్నాళ్లపాటు అమీర్ ఖాన్ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నారు. అన్నట్టుగానే సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే నిర్మాతగా మాత్రం పలు సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్ (Aamir Khan) ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) దర్శకత్వంలో అమీర్ ఖాన్ హీరోగా ఓ మూవీ తెరపైకి రాబోతోందని టాక్ నడుస్తోంది. రీసెంట్ గా వంశీ పైడిపల్లి ప్రముఖ నిర్మాత దిల్ రాజు దగ్గరకు సాలిడ్ సబ్జెక్టుతో వెళ్ళగా, ఆ స్క్రిప్ట్ కు అమీర్ ఖాన్ అయితే సరిగ్గా సరిపోతారని ఆయన సజెస్ట్ చేశారనే వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇక కథ కూడా నచ్చడంతో అమీర్ ఖాన్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ కాంబోలో రానున్న ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోందని అంటున్నారు.
ఒకవేళ ఈ వార్తలు కనుక నిజమైతే మరో తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ లో దుమ్ము రేపడం ఖాయం. అయితే ఇప్పటిదాకా వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) తెరకెక్కించిన 6 సినిమాలలో, 5 సినిమాలకు దిల్ రాజే (Dil Raju) నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు అమీర్ ఖాన్ – వంశీ పైడిపల్లి సినిమాను కూడా ఆయనే నిర్మించబోతున్నారని టాక్ నడుస్తోంది.
వంశీ పైడిపల్లి నుంచి వచ్చిన చివరి సినిమా ‘వారసుడు’. కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఈ డైరెక్టర్ కి సరైన అవకాశాలు రాలేదు. అయితే ఈ మధ్యనే బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నట్టుగా రూమర్లు సందడి చేశాయి. కానీ ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఆయన షాహిద్ కపూర్ తో కాదు అమీర్ ఖాన్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.