Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ఇప్పట్లో అయితే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. కానీ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా పేరు దక్కించుకున్నారు వర్మ. రాంగోపాల్ వర్మ ఏదైనా ఒక షాట్ తీశారు అంటే కచ్చితంగా ఇంకొకరు పేరు పెట్టేలా ఉండదు. అంతలా తన అద్భుతమైన టేకింగ్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో రాంగోపాల్ వర్మ ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ లను విమర్శిస్తూ కామెంట్లు చేశారు.. అంతేకాదు వ్యూహం అంటూ ఒక సినిమాను తీసి అందులో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లను చెడ్డవారిగా చూపించిన విషయం తెలిసిందే.
మార్ఫింగ్ ఫోటోలతో చిక్కుల్లో పడ్డ వర్మ..
దీనికి తోడు గత ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత సీఎం చంద్రబాబు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేశారు వర్మ. అప్పుడు ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకోని వీరు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత తమ అధికారాన్ని ఉపయోగించుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఒంగోలులో ఈయనపై కేసు నమోదు అవ్వగా.. ఈనెల 19వ తేదీన వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉందని, పోలీసులు నోటీసులను ఒంగోలు నుంచి హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లి మరీ అందజేశారు. కానీ ఆ రోజున రావడం కుదరదని వారం రోజులు గడువు కావాలని కోరారు వర్మ.
విచారణకు డుమ్మా.. రంగంలోకి దిగిన పోలీసులు..
దాంతో విచారణను వాయిదా వేసిన పోలీసులు.. ఈరోజు అనగా నవంబర్ 25 ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని వర్మకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసు ఇచ్చారు. విచారణ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ జరగాల్సి ఉంది. కానీ వర్మ ఈసారి కూడా తప్పించుకోవాలనుకున్నారు. అందులో భాగంగానే విచారణకు హాజరు కావడం లేదంటూ తన లాయర్ శ్రీనివాస్ కు వర్మ సమాచారం ఇవ్వగా.. ఇదే విషయాన్ని లాయర్ పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. ఇలా రెండుసార్లు విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న వర్మకి పోలీసులు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అరెస్ట్ వారెంట్ జారీ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.
రాంగోపాల్ వర్మ కెరియర్..
రాంగోపాల్ వర్మ కెరియర్ విషయానికి వస్తే.. ఒకప్పుడు శివ, క్షణక్షణం వంటి చిత్రాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు. అంతేకాదు వర్మ అంటే ఆ సినిమాలే గుర్తొస్తాయి. ఆ తర్వాత తీసిన రక్త చరిత్ర సినిమా మరో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇక తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన వర్మ ఎక్కువగా అడల్ట్ చిత్రాలు చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. అంతేకాదు ఎంతో మంది హీరోయిన్ లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు కూడా. అంతేకాదు వర్మ హీరోయిన్ అంటే ఒక మార్కు ఉండేలా వారిని తీర్చిదిద్దారు. ముఖ్యంగా వర్మతో పని చేసిన చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు బిగ్ బాస్ లోకి కూడా వచ్చి మరింత పాపులారిటీ అందుకున్న విషయం తెలిసిందే.