Richest Singer : సాధారణంగా ఏ సింగర్ అయినా సరే ఒక సినిమాలో పాట పాడి , ఆ పాట క్లిక్ అయితే భారీ పారితోషకం పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మన ఇండియన్ సినిమాలో అద్భుతమైన పాటలు పాడి, సింగర్స్ గా శ్రోతలను అలరిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఎంతో డిమాండ్ ఉన్నవారు కూడా ఒక్కో పాటకు రూ .5 నుండి రూ.8 లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. ఇక వీరి ఆస్తులు విషయానికొస్తే.. మహా అంటే రూ.100 కోట్లు లేదా రూ.200 కోట్ల లోపే. కానీ ఇక్కడ ఒక సింగర్ ఆస్తి విలువ తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. అంతే కాదు ఈమె ఆస్తి ముందు బాలీవుడ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న షారుక్ ఖాన్ (Sharukh Khan) కూడా వెనకడుగు వేయాల్సిందే. దేశంలోనే అత్యంత సంపన్న నటుడిగా పేరు తెచ్చుకున్న షారుక్ ఖాన్ కూడా ఈమె ఆస్తి ముందు పనికిరాడు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
రిచెస్ట్ సింగర్ గా అనన్య శ్రీ బిర్లా..
అసలు విషయంలోకెళితే పాటల రచయితగా, సింగర్ గా సంగీత ప్రియులకు దగ్గరైన అనన్య శ్రీ బిర్లా(Ananya Sri Birla) అత్యంత ధనవంతురాలు అని బహుశా చాలామందికి తెలియదనే చెప్పాలి. ఈమె సింగర్ మాత్రమే బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా (Kumar mangalam Birla) పెద్ద కుమార్తె కూడా. 2016లో సంగీత రంగ ప్రవేశం చేసిన ఈమె, అంతర్జాతీయ కళాకారులతో కూడా కలిసి పనిచేశారు. 28 సంవత్సరాల వయసులోనే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక ఈమె ఆస్తుల విలువ అక్షరాల రూ.లక్ష కోట్ల పైమాటే. ఈ విషయం తెలిసి అందరూ నోరెళ్ళ పెడుతున్నారు. ఒక సింగర్ ఈ రేంజ్ లో సంపాదించడం , అందులోనూ 30 ఏళ్ల లోపే ఈ రేంజ్ లో సంపాదన అంటే ఆమె ఎంత కష్టపడిందో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రిచెస్ట్ సింగర్ గా గుర్తింపు సొంతం చేసుకుంది అనన్య శ్రీ బిర్లా.
అనన్య శ్రీ బిర్లా విద్యాభ్యాసం..
అనన్య శ్రీ బిర్లా విషయానికి వస్తే.. చిన్న వయసులోనే సంగీతంపై మక్కువ పెంచుకున్న ఈమె 11 ఏళ్ల వయసులోనే సంతూర్ వాయించడం నేర్చుకుంది. ఆ తర్వాత అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబే లో స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈమె , 2011లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం , నిర్వహణలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే పబ్, క్లబ్ లలో పాటలు పాడడం మొదలుపెట్టిన ఈమె, అక్కడే గిటారు వాయించడం కూడా మొదలుపెట్టింది. అలా లివింగ్ ది లైఫ్ అనే పాటతో తొలిసారి వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ కళాకారులతో కూడా పనిచేసిన ఈమె 2017 నాటికి యూట్యూబ్ లో 14 మిలియన్లకు పైగా వ్యూస్ పొందిన మొదటి భారతీయ కళాకారిణిగా పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు ఈమె పాడిన పాటలు 2019లో మ్యూజిక్ చార్ట్ లలో అగ్రస్థానంలో నిలిచాయి. మరోవైపు 17 సంవత్సరాల వయసులోనే మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ ని సొంతంగా స్థాపించి, ఈ సంస్థ ద్వారా భారతదేశంలోనే గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు చిన్నచిన్న రుణాలు ఇస్తూ మంచి పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు 2014లో స్వచ్ఛ భారత్ సమ్మాన్ ద్వారా గోల్డ్ మెడల్ ను కూడా సొంతం చేసుకుంది అనన్య శ్రీ బిర్లా.