S.J.Surya: కోలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య (S.J.Surya)కి చెన్నైలోని ‘వేల్స్ విశ్వవిద్యాలయం’ తాజా గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలతోపాటు ఆయన అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డిసెంబర్ ఒకటవ తేదీన చెన్నైలోని పల్లవరంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ 15వ స్నాతకోత్సవ వేడుక చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోకసభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందులో సుమారు 5000 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పరిశోధక విద్యార్థులకు పట్టాలను ప్రధానం చేయడం జరిగింది.
ఎస్.జె.సూర్యకు గౌరవ డాక్టరేట్..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, గీతా రచయితగా కూడా పేరు సొంతం చేసుకున్నారు ఎస్ జె సూర్య. ఇక ఇలా అన్ని రంగాలలో తన ప్రతిభను కనబరిచిన ఈయనకు తాజాగా అరుదైన గౌరవం లభించింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్.జె.సూర్యకి గౌరవ డాక్టరేట్ తో వేల్స్ విశ్వవిద్యాలయం సత్కరించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 25 సంవత్సరాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందించినట్లు యూనివర్సిటీ తెలిపింది.
గతంలో రామ్ చరణ్ కి కూడా..
అలాగే బ్యాట్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధులను ఒలంపిక్ క్రీడల్లో ప్రపంచ వేదికపై విజయం సాధించేలా మార్గ నిర్దేశం చేసిన కోచ్ ‘పుల్లెల గోపీచంద్’ కి కూడా ఈ గౌరవ డాక్టరేట్ లభించింది. ఇకపోతే ఈ వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గత ఏడాది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కూడా గౌరవ డాక్టరేట్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలోనే ఎస్.జె.సూర్య కూడా గౌరవ డాక్టరేట్ అందుకోవడంతో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఎస్.జె.సూర్య చిత్రాలు..
ఒకప్పుడు వరుస చిత్రాలకు దర్శకత్వం అందించి, భారీ గుర్తింపు అందుకున్న ఈయన ఇప్పుడు దర్శకత్వానికి కాస్త విరామం ఇచ్చి, నటన వైపు అడుగులు వేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలుగు, తమిళ్ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ హీరోగా, శంకర్(Shankar)దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది.ఎస్.జె. సూర్య తొలిసారి పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్ హిట్ గా నిలిచిన ఖుషి చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ కి కూడా మంచి గుర్తింపు లభించింది. 2001లో విడుదలైన ఈ సినిమా టేకింగ్ చేసిన తీరుకి ఎస్ జె సూర్య పై చాలామంది ప్రశంసలు కురిపించారు. ఇక అలా ప్రేక్షకులను అలరించిన ఈయన ఇప్పుడు విలన్ గా మారి పలు సినిమాలలో ఆకట్టుకుంటున్నారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న తర్వాత తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నట్లు సమాచారం.