Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బీ టౌన్ లో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఈమధ్య కాలంలో తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)హీరోగా నటించిన ‘ ఆది పురుష్ ‘ సినిమాలో రావణాసుర క్యారెక్టర్ పోషించి, ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా నటించిన ‘దేవర ‘(Devara )సినిమాలో విలన్ గా ‘భైరా’ పాత్రలో నటించి, మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు ‘దేవర పార్ట్ 2’ లో కూడా నటించనున్నారు.
బీటౌన్ హీరోలకు రక్షణగా పోలీసులు..
ఇదిలా ఉండగా తాజాగా సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ మధ్యకాలంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) మొదలుకొని విక్రాంత్ మాస్సే, షారుఖ్ ఖాన్ వంటి హీరోలను కొంతమంది ఆగంతుకులు చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే దీంతో అలర్ట్ అయిన ముంబై పోలీసులు వెంటనే బీ టౌన్ హీరోలకు రక్షణ కూడా కల్పిస్తున్నారు. అయితే ఈ హత్య బెదిరింపులు సైఫ్ అలీ ఖాన్ కి కూడా వచ్చాయట . అయితే ఇప్పుడు కాదు కానీ గతంలో ఆయన కరీనాకపూర్ (Kareena Kapoor) ను వివాహం చేసుకునే సమయంలో వచ్చినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు సైఫ్ అలీఖాన్.
నాకు కూడా బెదిరింపులు తప్పలేదు..
సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. మా పెళ్లిని ఎంతోమంది వ్యతిరేకించారు. మా బావ రణబీర్ కపూర్ (Ranbeer Kapoor) కు అజ్ఞాత లేఖ ఒకటి వచ్చింది. అందులో మా కుటుంబాన్ని చంపేస్తామని , మా ఇంటి దగ్గర బాంబు కూడా పెట్టి పేలుస్తామని రాశారు. అయితే ఆ బెదిరింపులు మమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టలేదు. గతంలో కూడా మా కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు ఎన్నో వచ్చాయి. అసలు ప్రజల మన గురించి ఏమనుకుంటున్నారు అని నేనెప్పుడూ ఆలోచించలేదు. బెదిరింపులకు, బెదిరింపులు నిజం చేయడానికి ఎంతో తేడా ఉంది మతాంతర వివాహం కావడంతో నా తల్లిదండ్రులు కూడా అలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నారు.” అంటూ తెలిపారు సైఫ్ అలీ ఖాన్.
బెదిరింపులు తట్టుకొని పెళ్లి చేసుకున్న జంట..
ఇకపోతే కరీనా కపూర్ ను సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు.. కరీనా కపూర్ కి ఈ వివాహం చేసుకోవద్దని చాలామంది సలహా ఇచ్చారట. అంతేకాదు వీరి పెళ్లిని ఎంతోమంది వ్యతిరేకించారు కూడా.. కానీ సైఫ్ – కరీనా దేని పైన దృష్టి పెట్టకుండా తమ భావాలకు ప్రాముఖ్యత ఇచ్చి అక్టోబర్ 2012లో వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలోనే ఈ బెదిరింపులు ఎదుర్కొన్నట్లు సైఫ్ అలీ ఖాన్ తాజాగా వెల్లడించారు. ఇక కరీనాకపూర్ విషయానికి వస్తే. ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ఒకవైపు సినిమాలు మరొకవైపు యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తున్న ఈమె అటు భర్తకి కూడా అండగా నిలుస్తోంది అని చెప్పవచ్చు.