Saif Alikhan Health Update : బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ (Saif alikhan) ని నిన్న గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దారుణంగా పలు మార్లు కత్తితో పొడిచిన విషయం తెలిసిందే. ముంబైలోని ఈయన ఇంట్లోకి చొరబడి మరీ గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పై ఏకంగా ఆరుసార్లు కత్తితో పొడిచారు. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో సైఫ్ అలీఖాన్ ని తన కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ వెంటనే కార్లు అందుబాటులో లేకపోవడంతో ఆటోలో లీలావతి హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.ఇక హాస్పిటల్ కి ఆటోలో వచ్చిన సైఫ్ అలీఖాన్ ని రక్తపు మడుగుల్లో చూసి డాక్టర్లు సైతం షాక్ అయిపోయారు. వెంటనే ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా బీటౌన్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసింది ఎవరు? అని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.
సైఫ్ అలీఖాన్ పై దాడి..
ఇక సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన విషయంలో ఇప్పటికే పోలీసులు కీలక విషయాలు బయట పెట్టారు. అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంటి సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఇంట్లోకి ఎవరూ రాలేదని, ఇంట్లో వాళ్లే ఈ పనిచేశారని అన్నారు. కానీ ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వచ్చి ఆయనపై కత్తితో దాడి చేసిన వ్యక్తికి సంబంధించిన ఫోటో ని కూడా దొరకపట్టారు. సీసీ కెమెరాల్లో ఈ ఫోటో చిక్కింది. అయితే మొదట సైఫ్ కొడుకుల రూమ్ లోకి వెళ్లిన దొంగ, ఆ తర్వాత అక్కడే ఉన్న పిల్లల ఆయా అరవడంతో రూమ్ లో ఉన్న సైఫ్ అలీ ఖాన్ పరిగెత్తుకు వచ్చారు. ఆ తర్వాత కోటి రూపాయలు ఇవ్వాలని సైఫ్ అలీ ఖాన్ ని ఆ దొంగ డిమాండ్ చేయడంతో దానికి సైఫ్ నిరాకరించారు. దీంతో ఆరుసార్లు కత్తితో పొడిచినట్టు.. ఆ తర్వాత వైద్యులు గుర్తించారు. అందులో రెండు కత్తిపోట్లు లోతుగా దిగాయని కూడా తెలిపారు.అయితే సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి తాజాగా లీలావతి హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ ని విడుదల చేశారు. మరి సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
సైఫ్ అలీఖాన్ ఆరోగ్యంపై స్పందించిన డాక్టర్..
సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం గురించి డాక్టర్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం కుదుటపడింది.ఆయన ప్రస్తుతం నడుస్తున్నారు. నడిచేటప్పుడు ఇబ్బందికి గురైనట్టు మేము గుర్తించలేదు. ఆయన్ని ఐసియూ నుండి స్పెషల్ రూమ్ లోకి మారుస్తున్నాము. అలాగే సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేయడం వల్ల ఆయన వెన్నెముకకు లోతైన గాయం అయింది. ఈ గాయం కారణంగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆయన్ని అబ్జర్వేషన్ లోనే పెట్టామని, ఇక వెన్నెముక సర్జరీ చేసి వెన్నెముకలో కత్తిని తొలగించాము” అంటూ లీలావతి హాస్పిటల్ న్యూరో సర్జన్ నితిన్ డాంగే చెప్పుకువచ్చారు.. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది అని డాక్టర్ చెప్పడంతో సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పటికే కత్తితో దాడి చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.అరెస్ట్ చేసిన వ్యక్తి నుండి మరింత సమాచారం రాబడుతున్నారు.
సైఫ్ అలీ ఖాన్ తెలుగు చిత్రాలు..
ఇక సైఫ్ అలీ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన సౌత్ లో చాలా సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేస్తున్నారు. అలా ఆదిపురుష్ మూవీలో రావణాసురుడి పాత్రలో నటించారు. అలాగే దేవర మూవీలో కూడా నెగిటివ్ పాత్రలో చేశారు.