SSMB 29 Update : ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ SSMB 29. జక్కన్న (SS Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రూపొందుతున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. మరి మూవీ షూటింగ్ ఎప్పుడు షురూ కాబోతోంది? తాజాగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఈ మూవీ షూటింగ్ కోసమే హైదరాబాద్ కు వచ్చిందని జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు నిజముంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి?
‘ఆర్ఆర్ఆర్’ (RRR) బ్లాక్ బస్టర్ తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ SSMB 29. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఈ సినిమాతో డైరెక్ట్ గా పాన్ వరల్డ్ స్టార్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నిన్న మొన్నటిదాకా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్న జక్కన్న 2025 జనవరి మొదట్లోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో మూవీ ఓపెనింగ్ కార్యక్రమం లాంఛనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను మాత్రం బయటకు రాకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. మహేష్ బాబు లుక్ బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అలా చేశారు అనే రూమర్ వినిపించింది. దీంతో మహేష్ అభిమానులు నిరాశపడ్డారు.
కానీ ఇప్పుడు మహేష్ బాబుతో పాటు రాజమౌళి అభిమానులు కూడా సంతోషించే గుడ్ న్యూస్ వచ్చేసింది. SSMB 29 మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి 25 నుంచి మొదలవుతుందని సమాచారం. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. దీనిపై మేకర్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదు…
ఇక ఈ సినిమాలో నటీనటులు ఎవరు అన్న విషయాన్ని ఇంకా జక్కన్న ప్రకటించలేదు. దీంతో ఇప్పటిదాకా కేవలం మహేష్ బాబు హీరో అనే విషయంపై మాత్రమే క్లారిటీ ఉంది.. ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ ఎవరు అన్న విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. గత కొన్ని రోజుల నుంచి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటించబోతోంది అనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ప్రియాంక చోప్రా టొరెంటో నుంచి డైరెక్ట్ గా హైదరాబాదులో ఈరోజు ఉదయమే ల్యాండ్ అవ్వడంతో, ఆమె SSMB 29 షూటింగ్ కోసమే హైదరాబాద్ కు వచ్చిందని జోరుగా వార్తలు వినిపించాయి.
తాజా సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. SSMB 29 సినిమాలో అసలు ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదు అనేది లేటెస్ట్ సమాచారం. మరి ప్రియాంక చోప్రా హైదరాబాదులో ఎందుకు అడుగు పెట్టింది ? SSMB 29 సినిమాలో హీరోయిన్ గా నటించబోయేది ఎవరు ? అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ మూవీని కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027లో SSMB 29 రిలీజ్ కానుందని టాక్ నడుస్తోంది.