Sailesh Kolanu: బాగా వైలెంట్ గా ఉన్నాడు.. వీడికి కొంచెం పువ్వులను, అమ్మాయిలను చూపించండిరా అని జులాయిలో రాజేంద్ర ప్రసాద్ అన్నట్లు.. డైరెక్టర్ శైలేష్ కొలనును చూస్తే అందరూ ఇదే మాట చెప్పుకొస్తున్నారు. అసలు హిట్ 3 లో ఆ అరాచకం, ఆ రక్తపాతం చూసి.. శైలేష్ మనిషేనా అనే అనుమానం కూడా రాకపోలేదు. పాపం.. శైలేష్ కి కూడా అదే అనుమానం వచ్చి ఉంటుంది. అందుకే వైలెన్స్ ను ఆపేసి లవ్ స్టోరీ వెంట పడడం మొదలుపెట్టాడు.
హిట్ 3 ప్రమోషన్స్ లోనే శైలేష్.. ఒక మంచి ఎంటర్ టైనర్, లవ్ స్టోరీ చేయాలనీ ఉందని చెప్పుకొచ్చాడు. ఏదో సరదాకు అంటున్నాడులే అనుకున్నారు. కానీ, పక్కా ప్లానింగ్ తోనే కుర్ర డైరెక్టర్ ఆ మాట అన్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం శైలేష్ కొలను.. హిట్ 3 తరువాత ఒక లవ్ స్టోరీ చేయబోతున్నాడట. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మరి హీరో ఎవరు అని అనుకుంటున్నారా.. ? పెళ్లి సందD సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక.. ఈ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యాడు.
తండ్రి శ్రీకాంత్, తల్లి ఊహ ఇద్దరు పోలికలతో పాటు నటనను కూడా పుణికిపుచ్చుకున్న రోషన్.. ఆబగా వచ్చిన ఛాన్స్ లు మొత్తం అందుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ఛాంపియన్ అనే సినిమాతో బిజీగా ఉన్న రోషన్.. తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. మోహన్ లాల్ నటిస్తున్న వృషభ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు శైలేష్ కొలను చేతిలో పడ్డాడు. ఇప్పటికే ప్రాజెక్టు డిస్కషన్ లో ఉందని తెలుస్తోంది. త్వరలోనే స్క్రిప్ట్ ను ఓకే చేసి.. మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట.
శైలేష్ హిస్టరీలో ఇప్పటివరకు ఒక లవ్ స్టోరీ అనేది లేదు. ఇప్పుడు ఒక్కసారిగా లవ్ స్టోరీ అంటే.. అది ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇది కాకుండా శైలేష్ మరో ఇద్దరు హీరోలను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. మరి మొదట లవ్ స్టోరీతో వస్తాడా.. ? లేక ఇంకేదైనా భయంకరమైన కథతో వస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.