Salaar: ఇండియన్ సినీ అభిమానులను ఊపేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ మళ్లీ థియేటర్లను రఫ్ఫాడిస్తోంది. ప్రభాస్ అభిమానులు ఈ రీ-రిలీజ్‌ను ఒక పండుగలా మార్చేశారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు, సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెరిగిన నేపథ్యంలో ‘సలార్’ను మళ్లీ థియేటర్లలో చూడాలనే ఉత్సాహం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. సాధారణంగా రీ-రిలీజ్ సినిమాలకు ప్రత్యేకమైన ప్రమోషన్లు ఉండవు. కానీ ‘సలార్’ విషయంలో అభిమానులు స్వయంగా ప్రమోషన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన ఓ క్రియేటివ్ ప్రమోషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గుంటూరు లోని థియేటర్‌లోకి ప్రవేశించే ముందు అభిమానులకు ప్రభాస్, సలార్ సినిమాలో వేసుకున్న స్టాంప్ వేసే ఏర్పాట్లు చేశారు. టికెట్ కలిగిన ప్రతి ప్రేక్షకుడి చేతిపై ఈ స్టాంప్ వేయడంతో, “స్టాంప్ ఉంటేనే సలార్ కోటలోకి ఎంట్రీ” అన్న నినాదం వైరల్‌గా మారింది. థియేటర్ల ముందే అభిమానులు క్యూ కట్టుకుని థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, ఢిల్లీ ఇలా అన్ని మేజర్ సిటీల్లో ప్రభాస్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌తో హోరెత్తిస్తున్నారు. పెద్ద పెద్ద కటౌట్లు, బాణసంచా, డీజే డాన్స్, స్పెషల్ కేక్ కటింగ్స్, ర్యాలీలతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది.
ఒక రీ-రిలీజ్ సినిమాకు ఇంతటి ఆదరణ రావడం అరుదు. కొన్ని చోట్ల అయితే ఫస్ట్ షో టికెట్లు గంటల్లోనే హౌస్‌ఫుల్ కావడం గమనార్హం. సినిమా హాళ్ల ముందు అభిమానుల హంగామా చూస్తుంటే, కొత్త సినిమా రిలీజైనట్టే అనిపిస్తోంది. ‘సలార్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటికే ‘సలార్ 2’ స్క్రిప్ట్ పనులు ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. ‘కేజీఎఫ్’ లాంటి సిరీస్‌లను తెరకెక్కించిన ప్రశాంత్, ‘సలార్’ సెకండ్ పార్ట్‌ను మరింత గ్రాండ్‌గా రూపొందిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ రీ-రిలీజ్ ద్వారా రెండో భాగంపై క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ‘సలార్’ ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ, థియేటర్లో పెద్ద స్క్రీన్‌పై చూడాలనే మానియా అభిమానుల్లో తగ్గడం లేదు.
ఒక రీ-రిలీజ్ సినిమాకు ఇంతటి స్పందన రావడం మామూలు విషయం కాదు. థియేటర్లలోకి ఎంటర్ అయిన అభిమానులు ఫస్ట్ సీన్ నుంచే అరుపులు, హంగామాతో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #SalaarReRelease అంటూ ట్రెండింగ్‌లో పెట్టారు. “ఇంతలా మళ్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా మళ్ళీ రావాలంటే ఎప్పటి దాకా వెయిట్ చెయ్యాలి” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈరోజు నుంచే ప్రదర్శనలు మొదలవడంతో థియేటర్ల వద్ద టికెట్ల కోసం పోటీ నెలకొంది. కొన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో స్పెషల్ షోలకి కూడా ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ‘సలార్’ రీ-రిలీజ్ ప్రభంజనం ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. మిగతా సినిమాలకు కూడా ఇదో కొత్త ట్రెండ్‌గా మారొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.