Kanthi Dutt.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, వరుస సినిమాలతో స్టార్ స్టేటస్ ను అందుకున్న హీరోయిన్స్ కి ఎక్కువగా యాడ్ ఆఫర్ వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్స్ ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరొకవైపు యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని భారీగా మోసం చేశాడు ఒక జువెలరీ షాప్ అధినేత. ముఖ్యంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సమంత (Samantha ), కీర్తి సురేష్(Keerthi Suresh)లాంటి పేరు ఉన్న హీరోయిన్స్ కూడా అతడి బుట్టలో పడి మోసపోయారని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
డబ్బు పేరుతో మోసం చేస్తున్న కాంతి దత్..
ప్రస్తుత కాలంలో కొత్త రకాల మోసాలు ఎక్కువైపోయాయి. కొంతమంది అయితే ఏకంగా సెలబ్రిటీలకే టోకరా వేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక జ్యువెలరీ షాప్ అధినేత డబ్బున్న వాళ్ళను, సెలబ్రిటీలను అలాగే హీరోయిన్స్ ని టార్గెట్ చేసుకొని మోసం చేస్తున్నాడు. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ (Kanthi Dutt)మీద తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పరిణీతి చోప్రా (Parineeti Chopra)బ్రాండ్ అంబాసిడర్ అంటూ శ్రీజా రెడ్డి(Sreeja Reddy)అనే మహిళా వ్యాపారవేత్త పెట్టుబడులు పెట్టించినట్లు సమాచారం. దీంతో ఆమె మోసపోయానని గ్రహించి, తాజాగా అతని పైన పోలీస్ కేసు పెట్టింది.
మోసపోయిన కీర్తి సురేష్, సమంత..
ముఖ్యంగా పరిణీతి చోప్రాకి కూడా వ్యాపారంలో షేర్ ఇస్తానని చెప్పి మోసం చేశాడని, ఫోర్జరీ సంతకాలతో పలువురు వ్యాపారవేత్తలను మోసం చేసి కోట్లల్లో డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు “సస్టెయిన్ కార్ట్” అనే సంస్థను స్థాపించి, సమంత, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి, కీర్తి సురేష్ లతో కూడా పెట్టుబడులు పెట్టించాడు. ఆ సంస్థతో కూడా వీళ్లను బాగా మోసం చేసినట్లు తెలుస్తోంది. గతంలోనే దీనిపై వార్తలు రాగా.. ఇటీవల అతను మోసం చేయలేదని, అవన్నీ అబద్ధాలు అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
రూ.100 కోట్లకు పైగా మోసం..
అయితే నాడు వారెవరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు అని, ఒక మహిళా వ్యాపారవేత్త తనకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టడంతో, ఇతగాడు మోసం చేసిన లిస్టులో కీర్తి సురేష్, పరిణీతి చోప్రా, డిజైనర్ శిల్పారెడ్డి, సమంతాతో పాటు పలువురు హీరోయిన్స్, బడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టు తెలిసింది. ఇక దాదాపు రూ.100 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు సమాచారం.. ప్రస్తుతం ఇతగాడి పై సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇతగాడి బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే శ్రీజ రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త చేసిన ఫిర్యాదుతో పోలీసులు కాంతి దత్ ను అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి పలువురు సెలబ్రిటీలు కూడా అలర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.