Bangladesh: ఇస్కాన్ కు చెందిన మరో ఇద్దరు సన్యాసులను బంగ్లాదేశ్ లో అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ లో కొద్దిరోజులుగా మైనారిటీలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ తో దేశవ్యాప్తంగా హిందువులు ఆందోళనలు చేపడుతున్నారు. కృష్ణ దాస్ జైలులో ఉండగా ఆయనను చూసేందుకు, ఆయనకు భోజనం తీసుకువెళ్లేందుకు రుద్రప్రోతి కేసబ్ దాస్, రంగనాథ్ శ్యామ్ సుందర్ దాస్ ఇద్దరు సన్యాసులు వెళ్లారు. దీంతో వీరిద్దరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.
పోలీసుల అదుపులో ఉన్న వీరిద్దరూ వాయిస్ రికార్డింగ్ ద్వారా తమ సన్నిహితులకు సందేశం పంపించడంతో అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం వీరిని కొత్వాలీ పోలీస్ స్టేషన్ నుండి జైలుకు పంపించినట్టు సమాచారం. పూజారులను అనుమానితులుగా అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతుందని బంగ్లాదేశ్ పోలీసు అధికారి చెప్పారు.
Also read: విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. ల్యాండింగ్ చివరి నిమిషంలో మళ్లీ గాల్లోకి
కానీ కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయింది. ఆనాటి నుండి దేశంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. నివేధికల ప్రకారం దాడులు చేసేందుకు 200 దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఇస్కాన్ పై నిషేదం విధించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇస్కాన్ మత ఛాందసవాద సంస్థ అని పేర్కొన్నారు.
పిటిషన్ తో ఏకీభవించిన న్యాయమూర్తి చిన్మయ్ కృష్ణదాస్ తో పాటూ 17 మంది ఇస్కాన్ తో సంబంధం ఉన్న వాళ్ల బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇస్కాన్ సంస్థపై నిషేదం విధించేందుకు నిరాకరించింది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దారుణాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పందించింది. బంగ్లాదేశ్ లో హిందువులు, మైనార్టీల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆ ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని ప్రకటించింది.