Sankranthiki Vasthunnam: ఈరోజుల్లో ఆస్కారం ఉన్నా లేకపోయినా చాలా సినిమాలకు సీక్వెల్‌ను ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు మేకర్స్. స్టోరీని మధ్యలోనే ఆపేసి సీక్వెల్‌లో మిగతా కథను చూసుకోమంటున్నారు. మామూలుగా ఒక సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయితే.. దాని సీక్వెల్ అదే రేంజ్‌లో హిట్ అవుతుందనే గ్యారెంటీ లేదు. అయినా కూడా ఈమధ్యకాలంలో సీక్వెల్స్‌తో రిస్క్ తీసుకోవడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఇటీవల విడుదలయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కు సీక్వెల్ ఉంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తను తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సీక్వెల్ ఉంటుందా?
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చింది. అందుకే చాలావరకు థియేటర్లలో ఎక్కువగా వారే కనిపిస్తారు. మూవీ విడుదలయ్యి దాదాపు అయిదు రోజులు అవుతున్నా ఇంకా చాలావరకు థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది. ఇలాంటి కథలతో ఫ్రాంచైజ్‌లు చేయడం అనిల్ రావిపూడికి అలవాటే. ఇప్పటికే ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ లాంటి ఫ్రాంచైజ్‌లతో ఆడియన్స్‌ను అలరించాడు. అందుకే ‘సంక్రాంతికి వస్తున్నాం’ను కూడా అలాంటి ఫ్రాంచైజ్ చేయాలనుకునే ఆలోచనతో క్లైమాక్స్‌లో తానే స్వయంగా వచ్చి సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉందని క్లారిటీ ఇచ్చాడు.
అక్కడే మొదలు
‘సంక్రాంతికి వస్తున్నాం’లో భర్తగా వెంకటేశ్, భార్యగా ఐశ్వర్య రాజేశ్, ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరీ నటించారు. ఈ ముగ్గురి పాత్రలను ఇలాగే మార్చకుండా ఉంచేసి.. వేరే కథతో సీక్వెల్‌ను తెరకెక్కించే ఛాన్స్ ఉందని దర్శకుడు అనిల్ రావిపూడి రివీల్ చేశాడు. ‘‘సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ చేసే స్పేస్ ఉంది. ఇందులో బాగా వర్కవుట్ అయ్యే కంటెంట్ ఉంది. దీనికి వేర్వేరు పరిస్థితులు యాడ్ చేయవచ్చు. ఈ సినిమాను రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి అక్కడి నుండే సీక్వెల్ కూడా మొదలుకావచ్చు. మరో అద్భుతాన్ని ఈ సీక్వెల్ క్రియేట్ చేయవచ్చు’’ అని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. కానీ ఏదీ పక్కా అన్నట్టుగా చెప్పలేదు.
Also Read: పవన్ కళ్యాణ్ వల్లే నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది.. బుల్లి రాజు కామెంట్స్
టైటిల్ అదే
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సీక్వెల్‌కు ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ దాదాపుగా కన్ఫర్మ్ అన్నట్టుగా చెప్పాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). మొత్తానికి ఫ్యామిలీని ఇంప్రెస్ చేసే కథలతో దర్శకుడిగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు అనిల్ రావిపూడి. ఒకటే టెంప్లేట్‌తో ఇలా సినిమాలు చేస్తూ అస్సలు ఫ్లాప్ లేని దర్శకుడిగా అనిల్ సెటిల్ అవుతాడని చాలామంది ఊహించలేదు. అనిల్ సినిమాలు యూత్‌కు క్రింజ్ అనిపించినా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మాత్రం తనకు మంచి సపోర్ట్ లభించింది. అందుకే జనవరి 14న విడుదలయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ.160 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌పై అనిల్‌కు ఎంత పట్టు ఉందో అర్థమవుతోంది.