Kona Venkat: ఇటీవలే నటి అంజలి నటించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీకి నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్‌పై తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఓ దళిత యువకుడిపై దాడి చేశారన్న తరుణంలో బాపట్ల జిల్లా కర్ల పాలెంలో కేసు నమోదు అయింది. అయితే ఈ దాడి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సమక్షంలోనే జరిగిందంటూ ఫిర్యాదు చేయగా.. ఎస్పీ వకుల్ జిందాల్.. ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కోన వెంకట్ బాబాయ్ రఘపతి బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ సారి కూడా ఆయన బరిలో నిలిచారు. ఇక కోన వెంకట్ బాపట్ల మండలానికి వైసీపీ ఇంచార్జిగా ఉన్నారు. అయితే గణపవరం ఎస్సీ నాయకుడు కత్తి రాజేష్ వైసీపీని వీడి.. శనివారం తన అనుచరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మ సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు.
ఈ నేపథ్యంలో కత్తి రాజేష్ తమ వద్ద నుంచి రూ.8 లక్షలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా టీడీపీలో చేరాడని వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంపై కత్తి రాజేష్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు, అనుచరులతో కలిసి రచయిత కోన వెంకట్ ఎస్సై సమక్షంలోనే తనపై దాడి చేశారని రాజేష్ ఆరోపించాడు. కేవలం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారన్న అసూయతో తనపై దాడికి పాల్పడ్డారని కత్తి రాజేష్ ఆరోపించారు. అంతేకాకుండా ఎస్సై కూడా తనపై దాడి చేశారని పేర్కొన్నాడు.
Also Read: ఎన్టీఆర్ ఒప్పుకోకపోతే.. నిరాహార దీక్ష చేస్తా
దీంతో టీడీపీ నేతలు అన్నం సతీష్, నరేంద్ర వర్మ, గోవర్ధన్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు కలిసి గణపవరం ఎస్సీ కాలనీ వాసులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అనంతరం కోన వెంకట్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆపై రోడ్డుపై బైఠాయించారు. దీంతో కర్లపాలెం పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ఎస్సై సమక్షంలో రాజేష్‌పై దాడి జరగడంపై డీఎస్పీ మురళీ కృష్ణ తీవ్రంగా పరిగణించారు.
ఆపై ఎస్సైని సస్పెండ్ చేస్తూ.. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే కోన వెంకట్‌తో సహా వైసీపీ నేతలు, అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సరిగ్గా ఎన్నికలకు ఒకరోజు ముందు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది.