Allu Arjun Case:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన అంశం సంధ్య థియేటర్ ఘటన. డిసెంబర్ 4వ తేదీన ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన సంఘటన నుంచి సినీ ప్రేక్షకులు ఇంకా బయటపడలేకపోవడం గమనార్హం. అక్కడ తొక్కిసలాట జరగగా.. రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కొడుకు (శ్రీ తేజ్) ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇదిలా ఉండగా గత వారం రోజుల క్రితం.. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, అవయవాల పనితీరు మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. కానీ ఇప్పుడు మళ్లీ శ్రీతేజ్ ఆరోగ్యం క్షీణిస్తోంది అంటూ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక అప్డేట్ వదిలారు.
క్షీణిస్తున్న శ్రీ తేజ్ ఆరోగ్యం..
ఈ మేరకు వైద్యులు ఒక బులెటిన్ విడుదల చేశారు. ” గత రెండు రోజుల నుండి శ్రీ తేజ్ కి మళ్ళీ ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతోందని తెలిపారు. అతని ఛాతీ ఎక్స్రే బ్రోంకోస్కోపీ Rt వైపు మబ్బును చూపించింది. అతడికి నిన్నటి నుండి రక్తప్రసరణను కొనసాగించడానికి తక్కువ మోతాదు ఐనోట్రోపిక్ మద్దతు కూడా అవసరం పడుతోంది. పిసిఆర్ నివేదిక ప్రకారం అతనికి యాంటీబయోటిక్స్ శనివారం నుండి మార్చబడ్డాయి. ప్రస్తుతం అతడికి ఎటువంటి జ్వరం లేదు. నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ వెల్ ద్వారా ఆహారాన్ని తీసుకుంటున్నాడు. అతడి నాడీ సంబంధిత స్థితిలో ఎలాంటి మార్పు లేదు” అంటూ వైద్యులు తెలిపారు ప్రస్తుతం ఈ విషయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
శ్రీ తేజ్ ఆరోగ్యం పై తండ్రి ఎమోషనల్..
ఇకపోతే గత పది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన శ్రీ తేజ్ తండ్రి ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు కళ్ళు తెరచి, మూస్తున్నాడు కానీ తనను గుర్తు పట్టడం లేదని భావోద్వేగానికి గురైయ్యాడు. తన కూతురు ఏమో అమ్మ ఊరికి వెళ్ళింది వస్తుంది అని చెబుతోందని గుండెలవిసేలా రోదించారు. తన కొడుకు ఆరోగ్యంగా తిరిగి రావాలి అని, ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తోందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ బాలుడు తిరిగి ఆరోగ్యంగా రావాలి అని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.
పుష్ప 2 బెనిఫిట్ షో కారణంగానే ఇదంతా..
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar ) కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘పుష్ప 2’. ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలయ్యింది. కానీ నాలుగవ తేదీ హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్లో ఈ సినిమా బెనిఫిట్ షో వేశారు. అక్కడికి అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహించుకుంటూ వచ్చారు. అభిమానులు తమ అభిమాన హీరోని చూడడానికి ఎగబడ్డారు. దీంతో అల్లు అర్జున్ బౌన్సర్లు అభిమానులపై దాడి చేయడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. దీంతో శ్రీ తేజ్ తల్లి అక్కడికక్కడే మరణించగా ప్రస్తుతం శ్రీ తేజ్ హాస్పిటల్ లో ప్రాణాల కోసం పోరాడుతున్నారు.