KTR News: సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే.. పలు రకాల కేసులు పెట్టి తనను జైలుకు పంపించాలని ప్రయత్నం చేసినట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడారు. పసలేని పనికి మాలిన కేసులు పెడుతుందని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అవినీతి జరగకపోయినా.. అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. ప్రభుత్వం తమ అధికార యంత్రాంగం చేతిలో ఉందని అడ్డగోలుగా కేసులు పెడుతుందని అయినప్పటికీ.. భయపడకుండా ఎదుర్కొంటామని అన్నారు. అవినీతి ఎక్కడ ఉందని అడిగితే.. కాంగ్రెస్ నేతలు చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. సీఎం ఫార్ములా-ఈ ప్రతినిధులతో కలిసిన ఫొటో బయట పెట్టడంతో ముఖ్యమంత్రి అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఫార్ములా-ఈ సంస్ధ అనుచిత లబ్ధి పొందిందనేది.. వాస్తవమైతే, వాళ్లపైనే ఎందుకు కేసు పెట్టలేదు? ముఖ్యమంత్రి రూ.600 కోట్లు అంటూ అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతున్నారని.. కాంట్రాక్టులను రద్దు చేసుకోలేమని చెబుతున్న ముఖ్యమంత్రి, ఫార్ములా-ఈ ని ఏ విధంగా రద్దు చేసుకున్నారు’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
హైదరాబాద్ పేరు ప్రతిష్టలు, తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు హైదరాబాద్ నుంచి ఫార్ములా ఈ రేసు పోవద్దన్న ఉద్దేశంతోనే డబ్బులు పే చేశామని కేటీఆర్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి కూడా అవకాశమే లేదని అన్నారు. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఒక పైసా అవినీతి జరగలేదని చెప్పారు. కోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి ఈ అంశంలో మరిన్ని విషయాలు చెప్పలేనని చెప్పుకొచ్చారు. ఏసీబీ ఎఫ్ఐఆర్‌ని కొట్టివేయాలని హైకోర్టులో కేసు నమోదు చేశానన్నారు. అయితే ఇదే అంశం పైన ఈడీ… ఏసీబీ ఆధారంగా కేసు నమోదు చేసిందని కేటీఆర్ అన్నారు.
Hyderabad City: హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. రేపు రాత్రి ఈ సర్వీస్ మీకోసమే!
ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవమే.. కానీ ఈ ఎఫ్ఐఆర్ హైకోర్టు కొట్టి వేస్తే ఏం జరుగుతుందో చూడాలని కేటీఆర్ అన్నారు. ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోందని.. ఏం జరుగుతుందన్నది చూద్దామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్దాలనూ, అసత్యాలనూ మీడియా యధాతధంగా ప్రచురితం చేస్తోందని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్నఇలాంటి సీఎం చూడలేదని అన్నారు. మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా రాష్ట్ర అప్పుల పైన ఒక్కొక్క అబద్ధాన్నీ అసెంబ్లీలో మాట్లాడారని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనను జైలులో వేయాలని పలు సార్లు ప్రయత్నించాడని.. అయినప్పటికీ తాను భయపడేది లేదని అన్నారు. రేవంత్ రెడ్డి తాతకు కూడా భయపడను అని కేటీఆర్ అన్నారు.