Hyderabad City: నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులకు వరాల జల్లు కురుస్తుందని చెప్పవచ్చు. నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే యువత సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పలు షాపింగ్ కాంప్లెక్స్ లు సైతం, భారీ ఆఫర్లు ప్రకటించాయి. అయితే నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్ సైతం అందినట్లు చెప్పవచ్చు.
తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ న్యూ ఇయర్ ను పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సదుపాయం కల్పించేందుకు అసోసియేషన్ నిర్ణయించింది. మద్యం సేవించి వాహనాలు నడిపిన ఎడల, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అసోసియేషన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని నగరవాసులకు అసోసియేషన్ కోరింది. మొత్తం 500 కార్లు, 250 బైక్ టాక్సీలు డ్రైవర్లు అందుబాటులో ఉంటారని, సేఫ్ జర్నీ కోసం ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉందన్నారు.
అంతేకాకుండా మెట్రో కూడా హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు చెప్పింది. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో రైళ్లను డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి వరకు నడపనున్నట్లు మెట్రో ప్రకటించింది. రాత్రి 12.30 గంటల వరకు చివరి రైలు నడపబడుతుందని, ఈ విషయాన్ని నగరవాసులు గుర్తించాలని మెట్రో కోరింది. అయితే నగరంలో రేపు రాత్రి ఫ్లైఓవర్లు మూసేస్తున్నట్లు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఓవైపు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ఉచిత రవాణా సదుపాయం కల్పించడం, అలాగే మెట్రో కూడా అర్ధరాత్రి వరకు సేవలను అందిస్తుండడంతో నగరవాసులకు ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.