3BHK Movie: ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తండ్రి గుమస్తా… చాలీ చాలని జీతం. కానీ, ఉన్నంతలో సంతోషంగా బతికే కుటుంబం. ఆ గుమస్తాకు అందమైన భార్య. చేతికి వచ్చిన కొడుకు.. పెళ్లీడుకొచ్చిన కూతురు. ఇక వారందరిది ఒకటే కల.. సొంతిల్లు. దాని కోసం ఒక్కో రూపాయిని దాచి ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశపడే జీవితాలు. ఇది ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కల. ఇక ఈ కలనే సినిమాగా చూపించడానికి రెడీ అయ్యాడు.. సిద్దార్థ్.
తెలుగు ప్రేక్షకులకు సిద్దును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాయ్స్ సినిమాతో హీరోగా పరిచయమై.. బొమ్మరిల్లు సినిమాతో తెలుగు కుర్రాడిగా మారిపోయాడు. కెరీర్ లో ఆటుపోట్లు సాధారణమే. కొన్నేళ్లు సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి.. ఈ మధ్యనే వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే .. ఇంకోపక్క మెసేజ్ ఓరియెంటెడ్, రియలిస్టిక్ కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు.
రెండేళ్ల క్రితం చిన్నా అనే సినిమాతో మంచి విజయాన్నే కాకుండా అవార్డులను సైతం కైవసం చేసుకున్న సిద్దు.. ఇప్పుడు మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. సిద్దార్థ్ 40 వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం 3BHK. శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయాని, గుడ్ నైట్ ఫేమ్ మీథ రంగనాథన్, సప్తసాగరాలు దాటి ఫేమ్ చైత్ర, యోగిబాబు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Vidaamuyarchi: పట్టుదల ఉంటే చాలదయ్యా.. ప్రమోషన్స్ కూడా ఉండాలి
” ఒక ఊరిలో ఒక రాజు ఉండేవారట.. లేదు లేదు.. ఇది రాజు కథ కాదు. ఇది మన ఇంటి కథ” అని సిద్దార్థ్ వాయిస్ తో ఈ టీజర్ మొదలైంది. ప్రతి ఇంట్లో ఉండే సీన్స్ ను ఈ టీజర్ లో చూపించారు. ఉదయాన్నే నాన్న నీళ్లు తీసుకురావడం.. అమ్మ కుక్కర్ లో పప్పు పెట్టడం.. చెల్లి చదువుకోవడం.. ఇలా ప్రతి ఫ్రేమ్ ను ఎంతో అద్భుతంగా చూపించారు. ఇక సిద్దు ఇంట్లో ఒక్కరిని పరిచయం చేస్తూ ఒక్కో వస్తువుకు ఒక్కో కథ ఉందని చెప్పుకొచ్చాడు.
ఇది మసాలా డబ్బా కాదు. అమ్మ చిన్న బ్యాంక్. ఇది నాన్నగారి సెంటిమెట్ బీరువా.. ఈ అడ్డం నా చెల్లి స్టిక్కర్ స్టాండ్.. ఇంకా ఈ కథలో నేను కూడా ఉన్నాను అని చెప్పడంతో సిద్దు ఫేస్ రివీల్ అవుతుంది. అలా ఈ సినిమాలో నటించినవారి అందరిని చూపించారు. సిద్దు తల్లిదండ్రులుగా శరత్ కుమార్, దేవయాని నటించగా.. మీథ చెల్లిగా కనిపించింది. ఇక సిద్దు ఫ్రెండ్ గా యోగిబాబు.. లవర్ గా చైత్ర కనిపించింది.
గుమస్తా అయినా శరత్ కుమార్ కుటుంబానికి ఉన్న ఒకే ఒక కల ఒక ఇల్లు కొనడం. అదే సినిమా పేరు 3BHK. టీజర్ ఎంతో బావుంది. ప్రతి మిడిల్ క్లాస్ కుర్రాడి కథలానే అనిపిస్తుంది. ఈ టీజర్ తోనే మంచి హైప్ తెచ్చేసుకున్నాడు సిద్దార్థ్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో సిద్దార్థ్ చిన్నా లాంటి హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.