Sonu Sood steps in to help to floods: తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. తెలంగాణలో ఖమ్మం, ఏపీలో విజయవాడ ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. దీంతో పాటు పలు ప్రాంతాల్లో వరదల ధాటికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఈ తరుణంలో పలువురు సినీ ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ప్రకటించారు. తాజాగా, సినీ నటుడు సోనూ సూద్ వరదల ప్రభావంపై స్పందించారు.
తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో సోనూసూద్ చలించిపోయారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇళ్లు కోల్పోయిన వారికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు తమ బృందం అవిశ్రాంతంగా పని చేస్తోందన్నారు.
ఈ విపత్కర సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అద్భుతంగా పనిచేస్తోందని సోనూ సూద్ కొనియాడారు. వరదల కారణంగా చాలామంది జీవనోపాధి కోల్పోయారన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ వంతుగా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తామన్నారు. మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నామన్నారు. సాయం కోసం [email protected]ను సంప్రదించాలని సూచించారు.
Also Read: వరద బాధితులకు అండగా మెగా మేనల్లుడు.. రూ. 25 లక్షలు విరాళం
ఇదిలా ఉండగా, కరోనా సమయంలో సోనూ సూద్ చాలామందికి అండగా నిలిచారు. ప్రాంతంతో సంబంధం లేకుండా కష్టంలో ఉన్న వారికి నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు.