Sr. NTR Vajrotsavam: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభంగా నిలిచిన స్వర్గీయ నటులు నందమూరి తారకరామారావు (Sr.NTR) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఈ ఏడాదితో 75 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం చాలా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ టి.డి జనార్ధన్. నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు నటించిన మొట్టమొదటి చిత్రం ‘మన దేశం’ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2024 నవంబర్ 24వ తేదీన భారీ ఎత్తున సినీ వజ్రోత్సవం జరగబోతోంది.
సినీ వజ్రోత్సవ కార్యక్రమానికి విజయవాడ వేదిక..
ఇకపోతే ఈ సినీ వజ్రోత్సవ కార్యక్రమానికి విజయవాడ వేదిక కానుంది. ఇక ఈ విషయం తెలిసి నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో ఇండస్ట్రీకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు నటుడుగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా, చలనచిత్ర సంపాదకుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. సాంఘిక , పౌరాణిక, చారిత్రక జానర్ లలో నటించిన ఘనత ఈయన సొంతం.
3 నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ కూడా..
సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఈయన తెలుగు, తమిళం, హిందీ, గుజరాతి భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించారు. 1954లో తోడుదొంగలు, 1960లో సీతారామ కళ్యాణం, 1970లో వరకట్నం అనే సినిమాలకు దర్శకత్వం వహించినందుకుగానూ 3 జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా అందుకున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు గానూ.. నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ తో భారత ప్రభుత్వం సత్కరించింది. అంతేకాదు ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్ గా కూడా పేరు దక్కించుకున్నారు ఎన్టీ రామారావు. ఇకపోతే రాముడు, కృష్ణుడు అంటే పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయిన ఈయన.. ఆరాధ్య దైవంగా పేరు లిఖించుకున్నారు. అంతేకాదు తెలుగువారు అన్నగారు అంటూ ముద్దుగా అభిమానంతో పిలుచుకుంటారు.
రాజకీయాలలో చెరగని ముద్ర..
సినిమాలలోనే కాదు రాజకీయంగా కూడా మంచి పేరు దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి, రాజకీయాల్లోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా అవతరించారు. 1956లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ను కూడా ఓడించి, ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రాష్ట్ర అసెంబ్లీలో 294 స్థానాలు గానూ.. 22 స్థానాలు గెలుపొంది టిడిపి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.
11 మంది సంతానం..
ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ హీరోగా.. రాజకీయాలలో కూడా భారీ పాపులారిటీ అందుకోగా.. ఆయన వారసులు కూడా ఇండస్ట్రీలో అటు రాజకీయ రంగంలో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా జయకృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ, నందమూరి, మోహనకృష్ణ , బాలకృష్ణ, సీనియర్ రామకృష్ణ, జయశంకర్ కృష్ణ ఇలా మొత్తం 7 మంది కొడుకులు కాగా.. దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, ఉమామహేశ్వరి, లోకేశ్వరి ఇలా మొత్తం నలుగురు అమ్మాయిలు ఉన్నారు. ఇక వీరంతా కూడా మంచి ఉన్నత స్థానాలలో సెటిల్ అయిన విషయం తెలిసిందే.