Sri Lakshmi: ప్రముఖ సీనియర్ లేడీ కమెడియన్ శ్రీ లక్ష్మీ (Sri Lakshmi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో నటించి, తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఈమె సోదరుడు, ప్రముఖ హీరో రాజేష్ (Rajesh) నేడు మన మధ్య లేకపోయినా.. ఆయన వారసురాలు ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) మాత్రం వరుస సినిమాలతో భారీ సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా తండ్రి, మేనత్తల ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఐశ్వర్య రాజేష్.. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చేసి భారీ సక్సెస్ ను అందుకుంది. దీంతో ఈ అమ్మడికి తెలుగులో కూడా అవకాశాలు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తొలిసారి తన మేనకోడలు ఐశ్వర్య రాజేష్ గురించి సీనియర్ లేడీ కమెడియన్ శ్రీ లక్ష్మీ స్పందిస్తూ.. ఊహించని కామెంట్స్ చేసింది. మరి అదేంటో ఆమె మాటల్లోనే విందాం..
ఐశ్వర్య సినిమా చూడకపోతే తన్నులు పడతాయి.. శ్రీలక్ష్మి
ఐశ్వర్య రాజేష్.. విక్టరీ వెంకటేష్(Venkatesh), డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil ravipudi) కాంబినేషన్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలో భాగ్యం పాత్ర పోషించింది. ఈమెతోపాటు మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) కూడా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి స్పెషల్గా థియేటర్లలోకి వచ్చిన ఈ క్రైమ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ నేపథ్యంలోనే సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆదివారం సాయంత్రం ‘విక్టరీ వేడుక’ పేరుతో ఈవెంట్ నిర్వహించగా.. ఈ వేడుకకు ఐశ్వర్య మేనత్త శ్రీలక్ష్మి హాజరయ్యారు. శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ.. “నా మేనకోడలు ఐశ్వర్య రాజేష్ నటించిన సినిమా కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి తీరాలి. లేకపోతే తన్నులు పడతాయి. ఐశ్వర్య ఇంట్లో రౌడీ.. బయటకు వచ్చినా రౌడీనే” అంటూ కామెడీ చేసింది శ్రీలక్ష్మి. “అయినా ఇలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా చూస్తారు..సినిమా చాలా బాగుంది.. ఐశ్వర్య ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంటిల్లిపాది చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసాము. సినిమా ఆధ్యాంతం బాగా నచ్చింది, పేరు పెట్టడానికి ఏమీ లేదు” అంటూ శ్రీలక్ష్మి చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఐశ్వర్య రాజేష్ గురించి తన మేనత్త శ్రీ లక్ష్మీ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
ఐశ్వర్య రాజేష్ కెరియర్..
ఒక ఐశ్వర్య రాజేష్ విషయానికి వస్తే.. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) నటించిన ‘రాంబంటు’ సినిమాలో బాల నటిగా కనిపించిన ఈమె, ఆ తర్వాత తమిళంలో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. చాలా ఏళ్ల తర్వాత రాజేంద్రప్రసాద్ తో మళ్ళీ కలిసి ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చేసి టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికీ కూడా గ్లామర్ షో చేయకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి చిత్రాలతో అలరించిన ఐశ్వర్య, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆకట్టుకుంది. ఇక త్వరలోనే తనకు మంచి హిట్ అందించిన వెబ్ సిరీస్ ‘సుజల్ : ది వోర్టెక్స్ 2’ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.