Srinidhi Shetty: ఈరోజుల్లో హీరోల కంటే హీరోయిన్ల మధ్యే పోటీ ఎక్కువగా పెరిగిపోయింది. ఒక సినిమాతో సక్సెస్ సాధించిన హీరోయిన్లు కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందించకపోతే వెండితెరపై నుండి కనుమరుగు అయిపోతున్నారు. అయినా కూడా కొందరు హీరోయిన్లు మాత్రం ఆఫర్ల విషయంలో చాలా ఆలోచిస్తున్నారు. నచ్చితేనే సినిమాలు యాక్సెప్ట్ చేస్తూ కెరీర్‌ను స్లోగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు శ్రీనిధి శెట్టిని చూస్తే అదే కేటగిరిలో ఉందని అర్థమవుతోంది. శ్రీనిధి శెట్టి అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ‘కేజీఎఫ్’. అలాంటి పాన్ ఇండియా సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ ఇచ్చిన శ్రీనిధి.. అందులో తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కామెంట్స్‌పై స్పందన
ప్రశాంత్ నీల్, యశ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమానే ‘కేజీఎఫ్’. ఈ మూవీ కన్నడ సినీ పరిశ్రమ రూపురేఖలను మార్చేయడమే కాకుండా అందులో నటించిన ప్రతీ ఒక్కరికీ స్టార్‌డమ్ తీసుకొచ్చింది. అప్పటివరకు అసలు వెండితెర మొహం చూడని శ్రీనిధి శెట్టి కూడా ఈ మూవీతోనే హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ‘కేజీఎఫ్’ లాంటి పాన్ ఇండియా మూవీతో తను హీరోయిన్‌గా పరిచయమవ్వడం చాలా అదృష్టం అని శ్రీనిధి గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ మూవీలో హీరోకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్ రోల్ చాలా చిన్నగా ఉంటుంది. దానిపై శ్రీనిధి శెట్టి తాజాగా స్పందించింది.
చాలా గర్వపడతాను
‘కేజీఎఫ్’ సినిమా శ్రీనిధి శెట్టి కేవలం పూలకుండి మాత్రమే, అందులో తను కేవలం గ్లామర్ కోసమే ఉందని చాలామంది ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో తను ఈ కామెంట్స్‌పై తాజాగా స్పందించింది. ‘‘కేజీఎఫ్‌లో నా పాత్ర చిన్నది అని నాకు ముందు నుండి తెలుసు. నాకు నా మొదటి సినిమా కేజీఎఫ్ అవ్వాలన్నది నా కల. అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇండియన్ సినిమాను ప్రతిబింబించే సినిమాలో భాగమవ్వడానికి చాలా అదృష్టం ఉండాలి. కేజీఆఫ్ తర్వాత నాకు పెద్దగా అవకాశాలు రాకపోయినా నేను ఆ సినిమాను మాత్రం వెనక్కి తిరిగి గర్వంగా చూసుకుంటాను. ఆ సినిమానే నాకు పేరు, ఫేమ్, గుర్తింపు అన్నీ తెచ్చిపెట్టింది. నా జీవితాన్ని మార్చేసింది’’ అని చెప్పుకొచ్చింది శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty).
Also Read: తాగేసి ప్రాణాలు తీసేస్తారా.? ప్రాణాలంటే లెక్క లేదా.. జాన్వీ సీరియస్ పోస్ట్..
ఇప్పటినుండి అలా చేయను
‘‘కేజీఎఫ్ (KGF)లో పూలకుండి లాంటి రోల్ చేశానని ఒప్పుకుంటాను, కానీ మళ్లీ అలాంటి పాత్ర వస్తే మాత్రం నేను యాక్సెప్ట్ చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను. పేరు, గుర్తింపు సరిపోదు. నేను చేసే పాత్రకు కూడా కొంచెం ప్రాధాన్యత ఉండాలని నేను తెలుసుకున్నాను’’ అని బయటపెట్టింది శ్రీనిధి శెట్టి. ప్రస్తుతం కన్నడ, తమిళంలో డెబ్యూ చేసి మంచి పేరు తెచ్చుకున్న శ్రీనిధి.. టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘హిట్ 3’లో హీరోయిన్‌గా కనిపించనుంది శ్రీనిధి శెట్టి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో రెండు పాటలు విడుదల కాగా.. అందులో వీరి కెమిస్ట్రీ అదిరిపోయిందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.