SS Rajamouli: తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అందించిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తీసింది కొన్ని సినిమాలే అయినా ఆ సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు రాజమౌళి. ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు (K.Raghavendra Rao) పర్యవేక్షణలో ‘శాంతినివాసం’ అనే సీరియల్ కి ఎపిసోడ్ డైరెక్టర్‌గా తన కెరీర్ ను ప్రారంభించి, ఆ తర్వాత ఎన్టీఆర్(NTR ) హీరోగా ‘స్టూడెంట్ నెంబర్ వన్’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ‘బాహుబలి’ మూవీతో ఆయన పాన్ ఇండియా దర్శకుడు అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో తెలుగువారి ఖ్యాతిని ఎల్లలు దాటించారు. ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ అడ్వేంచర్, యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ప్రస్తుతం ఆ మూవీ షూటింగులో బిజీగా ఉన్న జక్కన్నపై.. ఆయన స్నేహితుడు అని చెప్పుకుంటున్న ఉప్పలపాటి శ్రీనివాసరావు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు చావు ఒక్కటే మార్గమని, ఇదే తన మరణ వాంగ్మూలం అంటూ పోలీసులకు ఓ లేఖ రాశారు.
రాజమౌళి నుంచి ప్రాణహాని ఉంది – ఉప్పలపాటి శ్రీనివాస్ రావు..
డైరెక్టర్ గా మంచి పేరు దక్కించుకున్న రాజమౌళిపై ఇప్పటివరకు ఒక్క నెగిటివ్ మార్కు కూడా లేదు. కానీ తాజాగా రాజమౌళి టార్చర్ చేస్తున్నాడని.. తన 54 ఏళ్ల వయసులో తాను ఇప్పటికీ ఒంటరిగా ఉండడానికి కారణం రాజమౌళి అని ,తన జీవితాన్ని రాజమౌళి కోసం త్యాగం చేశాను అంటూ ఆయన స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు (Uppalapati Srinivas Rao) మెట్టుగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు చావు ఒక్కటే మార్గమని, ఇదే తన మరణ వాంగ్మూలం అని అందులో పేర్కొన్నారు. ఈ ఘటన ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనంగా మారింది.
నా జీవితాన్ని నాశనం చేశాడు – ఉప్పలపాటి శ్రీనివాస్ రావు..
ఉప్పలపాటి శ్రీనివాస్ రావు పోలీసులకు రాసిన లెటర్‌లో రాజమౌళిపై తీవ్ర ఆరోపణలు చేశారు. “నా ఫ్రెండ్ అయినటువంటి ఇండియా నంబర్ వన్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి, నేను 1990 నుంచే మంచి స్నేహితులం. మేము ఒకే కంచంలో తింటూ.. ఒకే మంచంలో పడుకుంటూ ఉండేవాళ్లం. అలాంటి నేను రాజమౌళి వల్ల టార్చర్ అనుభవించాను. ఇప్పుడు రాజమౌళి వల్ల చనిపోబోతున్నాను” అంటూ 3 పేజీల ఒక సుదీర్ఘ వాంగ్మూలంతో పాటూ ఆయన మాట్లాడిన వీడియోలను వాట్సాప్ ద్వారా ‘బిగ్ టీవీ’కి అందించారు. అలాగే తమది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ మూడో వ్యక్తి వివరాలను కూడా ఆయన లేఖలో రాశారు.
‘‘రాజమౌళి డైరెక్టర్ గా ఎదగడానికి నా జీవితం మొత్తం ధార పోశాను. ఆయన కోసమే ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే మిగిలిపోయాను. రాజమౌళి వల్లే నా జీవితం నాశనం అయ్యింది. ఇప్పుడు నన్ను టార్చర్ చేస్తున్నారు. ‘యమదొంగ’ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా టైటిల్స్ లో కూడా నా పేరు వేశారు. కావాలంటే చెక్ చేసుకోండి అని పేర్కొన్నారు. అంతేగాక రాజమౌళికి క్షుద్ర పూజలు తెలుసని, అందుకే ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయని, ఆ విద్యతో ఎవరినైనా ఆయన లోబరచుకోగలరని పేర్కొన్నారు. అయితే ఆ లేఖలో ఆయన పేర్కొన్న విషయాలు నమ్మశక్యంగా లేకపోవడంతో కావాలనే ఆరోపణలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళిని కావాలనే టార్గెట్ చేసుకున్నారా అనే అనుమానాలు నెలకొన్నాయి.
(నోట్: ఫిర్యాదుదారుడు లేఖలో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించామని పాఠకులు గమనించగలరు. అందులో పేర్కొన్న అంశాలకు బిగ్ టీవీ లైవ్ బాధ్యత వహించదు. కేవలం సమాచారం కోసమే ఈ వివరాలను అందించాం. అలాగే ఆయన పేర్కొన్న కొన్ని వివాదాస్ప అంశాలను సైతం గోప్యంగా ఉంచాం)