Suhasini: సినీ సెలబ్రిటీలకు ప్రేక్షకులకు తెలియని ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ వాటిని బయటపెట్టడానికి పెద్దగా ఇష్టపడరు. వారి ఆరోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలిస్తే దాని వల్ల వారి కెరీర్ ఎఫెక్ట్ అవుతుందని భయపడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం అలాంటి అనారోగ్య సమస్యలతో పోరాడడం పెద్ద విషయం కాదు అన్నట్టుగా ఇతరులను మోటివేట్ చేయడం కోసం ఇలాంటి విషయాలు బయటపెడతారు. తాజాగా సీనియర్ నటి సుహాసిని కూడా అదే చేశారు. నటిగా తను, దర్శకుడిగా తన భర్త మణిరత్నం ప్రస్తుతం తమ తమ కెరీర్‌లలో చాలా బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో తనకు ఉన్న అనారోగ్య సమస్య గురించి బయటపెట్టారు సుహాసిని.
పరువు పోతుందని
సుహాసిని మణిరత్నం ఇప్పటివరకు ప్రతీ భాషలో హీరోయిన్‌గా నటించారు. ఇక కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తల్లి పాత్రలతో బిజీ అయిపోయారు. ఇప్పటికీ తెలుగులోనే కాదు.. ఇతర సౌత్ భాషల్లో కూడా సుహాసినికి చాలా డిమాండ్ ఉంది. అయితే తనకు టీబీ సమస్య ఉందని, ఆ విషయం తనకు తెలిసిన తర్వాత కూడా భయంతో అందరి దగ్గర దాచానని బయటపెట్టారు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు సుహాసిని. నాకు అనారోగ్య సమస్య ఉన్న విషయాన్ని నేను సీక్రెట్‌గా ఉంచాను. పరువు పోతుందని భయపడ్డాను. ఎవ్వరికీ తెలియకుండానే ఆరు నెలలు చికిత్స తీసుకున్నాను’’ అని చెప్పుకొచ్చారు సుహాసిని.
రెండుసార్లు అదే సమస్య
‘‘కొన్నాళ్ల తర్వాత ఈ విషయాన్ని సమాజానికి తెలియజేయాలని, అందరిలో టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నాను’’ అని చెప్పుకొచ్చారు సుహాసిని. కోలీవుడ్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. సుహాసినికి ఆరేళ్ల వయసులోనే టీబీ ఉందని బయటపడిందట. ఆ తర్వాత కొన్నాళ్లు అంతా ఓకే అనుకున్నా మళ్లీ 36 ఏళ్లు వయసులో టీబీ వచ్చిందని తెలుస్తోంది. దాని వల్లే సుహాసిని ఒక్కసారిగా బరువు తగ్గడంతో పాటు తనకు వినికిడి సమస్య కూడా మొదలయ్యిందట. 1980లో ‘నెంజాతై కిల్లాతే’ అనే సినిమాతో కోలీవుడ్‌లో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది సుహాసిని. ఆ తర్వాత పలు తమిళ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.
Also Read: తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న యంగ్ హీరోయిన్స్.. వర్కవుట్ అయ్యేనా.?
దర్శకుడితో పెళ్లి
హీరోయిన్‌గా పరిచయమయిన కొన్నాళ్ల తర్వాతే దర్శకుడు మణిరత్నంతో ప్రేమలో పడ్డారు సుహాసిని. 1988 ఆగస్ట్ 26న సుహాసిని (Suhasini), మణిరత్నం (Mani Ratnam) పెళ్లి జరిగింది. 1992లో వారికి ఒక కొడుకు పుట్టాడు. తన పేరే నందన్. దర్శకుడిగా, హీరోయిన్‌గా ఈ భార్యాభర్తలు ఫుల్ బిజీగా ఉన్నా కూడా 1997లో వీరిద్దరూ కలిసి ఒక ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించారు. మద్రాస్ టాకీస్ అనే పేరుతో ప్రారంభమయిన ఈ ప్రొడక్షన్ కంపెనీ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సినిమాల్లో మాత్రమే కాదు.. రాజకీయాల్లో కూడా సుహాసిని చాలా యాక్టివ్. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కునే కష్టాల గురించి ఓపెన్‌గా చెప్తూ అందరికీ సాయం చేస్తుంటారు సుహాసిని మణిరత్నం.