Speaker Gaddam Prasad Kumar: బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన హరితహారం స్కీం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హరితహారం స్కీం లో భాగంగా పలు రకాల జాతుల మొక్కలను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రజల చేత నాటించింది. అయితే అందులో కొంత శాతం కొనోకార్పస్ చెట్లు ఉన్నాయని.. అవి చాలా ప్రమాదకరమని చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటితో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చని.. వెంటనే ఆ మొక్కలను తొలగించాలని ఇప్పటికే చాలా సందర్భాల్లో నిపుణులు సూచించారు.
అయితే, ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ప్రమాదకరమైన కోనోకార్పస్ మొక్కల గురించి మాట్లాడారు హరితహారంలో భాగంగా పెట్టిన కోనోకార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని స్పీకర్ వ్యాఖ్యానించారు. ఈ మొక్కలతో ప్రజల ప్రాణానికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఆయా శాఖల పద్దులను ప్రవేశపెట్టారు. వీటిపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో 200 కోట్ల చెట్లను నాటామని.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ప్రాంతం ఏడు శాతం పెరిగిందని అన్నారు.
దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో హరితహారంలో భాగంగా 200 కోట్ల మొక్కలు నాటామని చెబుతున్నారు.. అయితే ఆక్సిజన్ పీల్చి కార్బన్ డై ఆక్సైడ్ వదిలే హానికరమైన కోనోకార్పస్ మొక్కలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆ మొక్కలపై కనీసం పక్షలు కూడా వాలడానికి ఇష్టపడవని స్పీకర్ చెప్పారు. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. అవి కొన్ని మొక్కలు మాత్రమే కలిశాయని, పెరిగిన 7 శాతంలో అవి తక్కువేనని చెప్పుకొచ్చారు. దీనిపై మళ్లీ స్పీకర్ స్పందిస్తూ.. కొన్ని కాదు, పెద్ద మొత్తంలో అవే ఉన్నాయని, హైవే రోడ్ల వెంట, డివైడర్ల మీద కూడా అవే ఉన్నాయని చెప్పారు. అలాగే ప్రభుత్వం వాటిని వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు.
ALSO READ: Bank Jobs: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే జాబ్.. అప్లై చేస్తే చాలు..
ALSO READ: JOBS: టెన్త్ పాసైతే చాలు భయ్యా.. స్టైఫండ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.. ఇంకా వారం రోజులే..!