వివాహం అనంతరం అమ్మాయి భర్త ఇంటికి చేరుతుంది. అక్కడ అత్తమామలతో, భర్తతో, ఆడపడుచులతో, అందరితో ఆమె కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. ఈ కొత్త వాతావరణంలో అలవాటు పడడం ఆమెకు చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె కొత్త జీవితం ప్రారంభించడానికి ముందే అమ్మాయి తల్లిదండ్రులు కొన్ని విషయాలను కూతురితో చెప్పాలి. ఇలా చేయడం వల్ల ఆమె అత్తమామల ఇంట్లో సంతోషంగా జీవించగలదు.
భారతీయ చరిత్రలో గొప్ప పండితుడు ఆచార్య చాణక్యుడు. ఆయన ఎన్నో విషయాలను ముందుగానే తెలియజేశాడు. ఇప్పటికీ ఆ అంశాలను మనము పాటిస్తున్నాము. అలాగే ఆయన తల్లిదండ్రులు తమ కుమార్తెతో వివాహానికి ముందు చెప్పాల్సిన విషయాల గురించి కూడా ప్రస్తావించారు. అవేంటో తెలుసుకుందాం.
ఆత్మగౌరవం వదలవద్దు
చాణక్యుడు చెబుతున్న ప్రకారం తల్లిదండ్రులు తమ కూతురికి ఆత్మగౌరవం గురించి గట్టిగా చెప్పాలి. ఆమె ఎట్టి పరిస్థితుల్లో తన గౌరవానికి భంగం వచ్చేలా ప్రవర్తించకూడదు. అలాగే తన గౌరవం తగ్గేలా రాజీ కూడా పడకూడదు. ఒక వ్యక్తి ఆత్మగౌరవం ఎంతో ముఖ్యమైనది. అతడు ఆత్మగౌరవాన్ని కోల్పోతే జీవించినా లేకపోయినా ఒకటే. కాబట్టి అత్తమామలు భర్త చెప్పిన విషయాలను పాటించవచ్చు. కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోయేలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూతురికి అర్థమయ్యేలా వివరించాలి.
సంబంధాలను అర్థం చేసుకోమని
కూతురు అత్తారింటికి చేరాక అక్కడ అత్తమామలు, బావ, మరిది, వదినలు, మరదళ్ళు ఇలా ఎంతోమంది ఉంటారు. వారందరితో కూడా కొత్త పెళ్లికూతురు సంబంధాలు పెట్టుకోవాలి. ఆ అనుబంధాలు అందంగా ఉండాలి. అలాగే వాటికి ఒక పరిమితులు కూడా ఉండాలి. ఎలాంటి అనుబంధం ఉన్నవారితో ఎలా ప్రవర్తించాలో తల్లిదండ్రులు కూతురికి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అనుబంధాలలో కాస్త సర్దుబాటు కూడా అవసరమని ప్రతి ఒక్కరికి గట్టిగా సమాధానం ఇవ్వడం, వారిని పట్టించుకోకపోవడం వంటివి చేయకూడదని వివరించాలి.
ఆర్థికంగా స్వతంత్రత
అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఒక్క ప్రతి వ్యక్తి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళుతున్న కోడలికి కూడా ఆర్థిక స్వతంత్రత ఎంతో ముఖ్యమనే చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు. అందుకే మీ కూతురికి పెళ్లి అయ్యాక కూడా ఆర్థిక స్వతంత్రత ఉండేలా చూసుకోమని చెప్పండి. అత్తమామలు, భర్త నుంచి ప్రతి రూపాయిని అడిగి తీసుకోవడం, వారిపైనే పూర్తిగా ఆధారపడడం వల్ల ఎన్నో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థిక స్వాతంత్రాన్ని వదులుకోకుండా, ఆమె ఎవరిపైన ఆధారపడవలసిన అవసరం లేకుండా జీవించమని చెప్పండి. ఆమె సొంత నిర్ణయాలు ఆమె తీసుకోవాలంటే ఆర్థిక స్వతంత్రత అవసరం.
ఓపికగా ఉండమనండి
చాణక్యుడు చెబుతున్న ప్రకారం అనుబంధాలు దృఢపడాలంటే ఓపికగా కొన్నేళ్లపాటు వేచి ఉండాల్సిన అవసరం వస్తుంది. ఒక అమ్మాయి తన అత్తమామల ఇంట్లో కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది. ఆ సమయాన్ని కొత్ల పెళ్లి కూతురు ఇవ్వాలి. మొదటి వారంలోనే అత్తమామపై ఫిర్యాదులు చేసి మనసులో బాధ పెట్టుకోకూడదు. పెళ్లయిన తర్వాత కనీసం 6 నెలల పాటు ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ అమ్మాయికి అక్కడ ఉన్న అందరి గురించి అవగాహన వస్తుంది. లేకుంటే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడాల్సి వస్తుంది.
Also Read: ఇంట్లో లాఫింగ్ బుద్ధా ఉంటే నిజంగానే మీ అదృష్టం మారుతుందా?
అనుబంధాలకు సమయం ఇవ్వాలి
ఏ అనుబంధమైనా దృఢంగా మారాలంటే వారితో కాసేపు గడపాలి. అలాగే అత్తారింట్లో మీకు పరిచయమైన అందరితోనూ కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు సమయాన్ని కేటాయించండి. ప్రతి సంబంధానికి గౌరవం ఇవ్వండి. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మీ వివాహ జీవితాన్ని విజయవంతం చేస్తాయి. ఏ రకమైన తొందరపాటు పనులు చేయకుండా ఓపికగా ఉంటే మీ జీవితం ఆనందంగా ఉంటుంది.