Chiru: ప్రముఖ వ్యోమగాములు సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ అనుకున్న 8 రోజుల మిషన్‌ను పూర్తి చేసి తిరిగి రావాల్సిన చోట 286 రోజులు అంతరిక్షంలో గడిపి భూమికి సురక్షితంగా చేరుకున్నారు. వారి దీక్ష, సహనం, సాంకేతిక నైపుణ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అద్భుత ఘట్టంపై ట్వీట్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
“భూమికి తిరిగి వచ్చినందుకు స్వాగతం, సునీతా విలియమ్స్ & బుచ్ విల్మోర్ !! చరిత్రలో నిలిచే అద్భుతమైన ప్రయాణం చేసారు. 8 రోజుల కోసం స్పేస్‌కి వెళ్లి, 286 రోజుల తర్వాత, భూమి చుట్టూ 4577 సార్లు తిరిగి వచ్చారు! మీ కథ అద్దిరిపోయింది, టెన్షన్‌తో కూడినది, ఉత్కంఠగా సాగినది, ఒక బ్లాక్‌బస్టర్ సినిమా లాంటిది!! మీకు ఇంకా ఎక్కువ శక్తి !!! కలగాలి @Astro_Suni ఈ ఇద్దరినీ తిరిగి తీసుకోని వచ్చిన #SpaceXDragon #Crew9 వాళ్లకి ధన్యవాదాలు!” చిరంజీవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చెప్పినట్లుగా, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జీవితాలు నిజంగానే సాహసభరితమైనవి.
భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, 2007లో ఒక మహిళా వ్యోమగామిగా అత్యధికమైన అంతరిక్ష ప్రయాణ సమయాన్ని సాధించిన ఘనత సాధించారు. అంతరిక్ష నడకల్లోనూ ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు.
బుచ్ విల్మోర్ అమెరికన్ నావికాదళానికి చెందిన అధికారి, NASA వ్యోమగామి. అంతరిక్ష ప్రయోగాల్లో అనేక కీలక మిషన్లలో పాల్గొన్నారు. ఈసారి కూడా అనివార్య సాంకేతిక కారణాల వల్ల 8 రోజుల ప్రయాణం 286 రోజులు కొనసాగినా, వారు ధైర్యంగా ఎదుర్కొని భూమికి తిరిగొచ్చారు. ఇంత సాహసభరితమైన ప్రయాణం గురించి చిరంజీవి, ఇది ఏదైనా అడ్వెంచర్ మూవీకి తగ్గదని, నిజమైన బ్లాక్‌బస్టర్ అని ప్రశంసించారు. నిజంగానే, వారి జీవిత ప్రయాణం సినీ ప్రేరణ కలిగించే విధంగా ఉంది.
ఇప్పటికే సునీతా విలియమ్స్ జీవితం ఆధారంగా ఒక సినిమా రాబోతోందని కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇది నిజమైతే, ప్రేక్షకులకు ఒక ఇంటర్ స్టెల్లార్ స్థాయి సినిమాని చూసే అవకాశం దొరుకుతుంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆశిద్దాం!