Suthi Velu Wife: ఒకప్పుడు తెలుగు తెరపై నవ్వుల సందడి చేసిన ఎంతోమంది తారలు.. నేడు మన మధ్య లేకపోయినా వారి స్మృతులు ఎప్పటికీ మనల్ని తడుముతూనే ఉంటాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో తనదైన సేవలు అందించి చిరస్మరణీయంగా నిలిచిపోయారు సుత్తివేలు (Suthi Velu).. కమెడియన్ గా ప్రేక్షకులలో ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరగనిది. నటనలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఈయన 80-90 దశకంలో.. ఈయన లేకుండా సినిమా ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆ కాలంలో ప్రాచుర్యం పొందిన నటుడు ఆయన. ఎన్నో అవార్డులు, రివార్డులు సైతం అందుకున్నారు.
మేము ఆర్థిక ఇబ్బందుల్లో లేవు..
ఇదిలా ఉండగా తాజాగా ఆయన భార్య లక్ష్మీరాజ్యం (Lakshmi Rajyam) సుత్తి వేల సినీ ప్రస్థానం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “మా ఆయనను సినిమాలకి పరిచయం చేసిన జంధ్యాల గారిని మేము ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూనే ఉంటాము. సుత్తివేలు నాటకాలు కూడా బాగా వేసేవారు. త్రిశూలం సినిమా తర్వాత ఆయన వెనుతిరిగి చూడలేదు. ఆయనకి ధైర్యం ఎక్కువ. అదే మా బలం కూడా.. ఎవరు ఏం చెప్పినా నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడేవారు కాదు. దానాలు చేయడం ఆయన బలహీనత. తాను సంపాదించిన డబ్బు మాత్రమే ఖర్చు చేసేవారు. రాత్రి 12 గంటల వరకు మాతోనే సరదాగా మాట్లాడిన ఆయన, ఆ తర్వాత నిద్రలోనే చనిపోయారు. అప్పటికే ఆయన వయసు 63 ఏళ్లు. అయితే ఆయన అందరికీ దానాలు చేస్తారు కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని యూట్యూబ్ లో కొన్ని చానల్స్ వాళ్ళు రాయడం చూశాను. అది చూసి ఎంతో బాధపడ్డాను. నిజానికి మేము ఏ రోజు కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడలేదు. ఆయన బ్రతికున్నట్టుగానే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాము. మా అబ్బాయి మంచి జాబ్ కూడా చేస్తున్నాడు. సేవింగ్స్ కూడా ఉన్నాయి. మా ఆయన చనిపోవడానికి ముందు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే ఎందుకిలా దుష్ప్రచారాలు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు.
యూట్యూబర్స్ రాతలపై లక్ష్మీరాజ్యం ఫైర్..
దీనికి తోడు ఆయనపై ఎన్నో రూమర్స్ కూడా సృష్టించారు. ముఖ్యంగా తన సహనటి అయిన శ్రీలక్ష్మితో.. తన పిల్లల ముందే తాళి కట్టాడు అంటూ కూడా వార్తలు సృష్టించారు. అందులో కూడా ఏ మాత్రం నిజం లేదు. ఈ విషయాలు ఆయన ఉన్నప్పుడే వచ్చాయి. ఒకరోజు ఆయన నన్ను గదిలోకి పిలిచి, వచ్చి నా పక్కన కూర్చో అన్నారు.. నేను అలా కూర్చోగానే.. నాకు శ్రీలక్ష్మి కి పెళ్లయింది అంట కదా అని అడిగారు. దీంతో నేను.. నాకు ఎనిమిది నెలల క్రితమే తెలుసు.. అంటూ చెప్పాను. మరి ఎందుకు గొడవ పెట్టుకోలేదు అని అడగగా.. అది నిజం కాదు కదా.. ఎందుకు నేను గొడవ పడాలి. నిజమైతే అప్పుడు చూద్దాం అంటూ చెప్పాను”. అంటూ యూట్యూబర్స్ రాసేటప్పుడు వార్తలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశార. ఏది ఏమైనా సుత్తివేలు గురించి మనకు ఎన్నో తెలియని విషయాలను ఆయన సతీమణి లక్ష్మీ రాజ్యం చెప్పుకొచ్చారు. ఇకపోతే తన భర్త పై రాసిన తప్పుడు వార్తల కారణంగా తాము ఎంతో బాధపడ్డాము అని కూడా తెలిపారు.